అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై అనిశ్చితి తొలగిపోవడంతో స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది.
తొలగిన ఫెడ్ అనిశ్చితి
జోరుగా కొనుగోళ్లు
వరుసగా నాలుగో రోజూ లాభాలే
309 పాయింట్ల లాభంతో 25,804కు సెన్సెక్స్
93 పాయింట్ల లాభంతో 7,844కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై అనిశ్చితి తొలగిపోవడంతో స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. వరుసగా నాలుగో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 309 పాయింట్లు లాభపడి 25,804 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 7,844 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు చెరో 1.21 శాతం చొప్పున ఎగిశాయి. ఇది సెన్సెక్స్‌కు రెండు వారాల గరిష్ట స్థాయి. సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు లాభపడడం గడిచిన నెలరోజుల్లో ఇదే మొదటిసారి.
విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయమే....
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును బుధవారం రాత్రి పావు శాతం పెంచింది. దాదాపు పదేళ్ల కాలంలో వడ్డీరేట్లను పెంచడం ఇదే మొదటిసారి. ఫెడ్ వడ్డీరేటు పెంచితే విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటారని, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తక్షణం ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. ఫెడ్ వడ్డీరేటును పెంచడం ఆర్థిక వ్యవస్థ బలపడటాన్ని సూచిస్తోందని నిపుణులంటున్నారు. అంతేకాకుండా పావు శాతం వడ్డీరేట్లు పెంచడం ఖాయమేనని గత నెల రోజుల్లో ఫెడ్ నుంచి సంకేతాలందుతున్నాయని, రేట్ల పెంపునకు తగ్గట్టుగా మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు అయ్యాయని వారంటున్నారు. రేట్ల పెంపుపై అనిశ్చితి తొలగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ర్యాలీ జరిపాయని, ఆ ప్రభావంతోనే మన మార్కెట్ కూడా లాభాల బాట పట్టిందనేది వారి అభిప్రాయం.
దిగువ స్థాయిల్లో కొనుగోళ్లు జరగడం, గత కొన్ని సెషన్లలో బాగా క్షీణించిన మహీంద్రా అండ్ మహీంద్రా వంటి షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం, డాలర్‌తో రూపాయి బలపడడం కూడా కలసివచ్చాయి. వడ్డీరేట్ల పెంపు ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని, అయితే వృద్ధి అంచనాలు అనుకూలంగా ఉండడం వల్ల భారత్ విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమని ఫిచ్ రేటింగ్స్ వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి. భవిష్యత్ రేట్ల పెంపు దశలవారీగానే ఉంటుందని ఫెడ్ సంకేతాలివ్వడం, భారత్ వంటి వర్థమాన దేశాలకు ఊరటనిచ్చే విషయమని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
పడి.. లేచిన.. సెన్సెక్స్...
మొదట అరగంట ట్రేడింగ్‌లో సెన్సెక్స్ లాభాల్లో దూసుకుపోయింది. జీఎస్‌టీ బిల్లుపై అనిశ్చితితో నష్టాల్లోకి జారిపోయింది. యూరోప్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడంతో చివరి రెండు గంటల్లో మన మార్కెట్ కూడా దూసుకెళ్లింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకూ లాభపడింది. కాగా సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్ అధికంగా 4.7 శాతం లాభపడింది. 30 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, లుపిన్, గెయిల్, కోల్ ఇండియా- ఈ ఐదు సెన్సెక్స్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. హిందాల్కో, వేదాంత షేర్లు 3-5 శాతం రేంజ్‌లో ఎగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్‌లు లాభపడ్డాయి. 1,946 షేర్లు నష్టాల్లో, 743 షేర్లు లాభాల్లో ముగిశాయి.