ఎప్పుడైనా.. ఎక్కడైనా.. క్షణాల్లో నగదు బదిలీ... | with minetu in money lundaring | Sakshi
Sakshi News home page

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. క్షణాల్లో నగదు బదిలీ...

Published Mon, May 16 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. క్షణాల్లో నగదు బదిలీ...

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. క్షణాల్లో నగదు బదిలీ...

నడుస్తున్నది స్మార్ట్‌ఫోన్ల యుగం. ఇవి మన జీవితంలో అంతర్భాగమయ్యాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్లను దృష్టిలో ఉంచుకొనే కొత్త కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ జరుగుతోంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు నాందిపలుకుతున్నాయి. బ్యాంక్ ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ, కార్డు నంబరు, పేరు వంటి వివరాల అవసరం లేకుండానే కేవలం క్షణాల్లో మొబైల్ నుంచి డబ్బుల్ని ఇతరులకు పంపే సౌలభ్యం అందుబాటులోకి వస్తోంది. అదే యూపీఐ విధానం. దీంతో పేమెంట్స్ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభంకానున్నది. యూపీఐ ద్వారా ఎవరికైనా, ఎప్పుడైనా క్షణాల్లో డబ్బుల్ని పంపొచ్చు. అదెలాగో చూద్దాం..
 

* యూపీఐ విధానాన్ని ఆవిష్కరించిన ఎన్‌పీసీఐ
* ఇక సరళంగా, భద్రంగా చెల్లింపులు
* 1-2 నెలల్లో అందుబాటులోకి సేవలు
* వాలెట్లకు పోటీ తప్పదు

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఒక ఇన్‌స్టంట్ ఆన్‌లైన్ బ్యాంక్ పేమెంట్స్ విధానం. ఇది ఒక మొబైల్ ఇంటర్‌ఫేజ్ (యాప్). మొబైల్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. యూపీఐ ఒక రకంగా చూస్తే ఐఎంపీఎస్‌కు అడ్వాన్స్‌డ్ వెర్షన్ లాంటిది. యూపీఐ ద్వారా స్కూల్ ఫీజులు, కిరాణ సరుకులు, ఆన్‌లైన్ షాపింగ్ బిల్లులను కేవలం క్షణాల్లో చెల్లించొచ్చు. డబ్బుల్ని భద్రంగా తక్షణమే ఇతరులకు (వ్యక్తి-వ్యక్తి, వ్యక్తి-సంస్థ/వ్యాపారులు, సంస్థ/వ్యాపారులు-వ్యక్తి) పంపొచ్చు. అలాగే తీసుకోవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండే సర్వీసు. యూపీఐ విధానంలో  రెండంచెల అథంటికేషన్ వ్యవస్థ ఉంటుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఏ లావాదేవికైనా రెండంచెల అథంటికేషన్ తప్పనిసరి.
 
యూపీఐ ఎలా పనిచేస్తుందంటే?
బ్యాంకులు ఈ సర్వీసులను అందించాలంటే అవి ముందుగా యూపీఐ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం కావాలి. ప్రస్తుతానికి 29 బ్యాంకులు ఎన్‌పీసీఐతో భాగస్వామ్యమై ఉన్నాయి. ఈ బ్యాంకులు సర్వీసుల ప్రారంభానికి అనువుగా వాటి వాటి యాప్‌లను యూపీఐ ఫ్రేమ్‌వర్క్ కోసం అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంది. సదరు బ్యాంకు యూపీఐ సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన తర్వాత.. ఆ బ్యాంక్ మీకు ఒక వర్చ్యువల్ ఐడీని, మొబైల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (ఎంపిన్)ని కేటాయిస్తుంది.  

మీ పేరు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్‌లలో ఏదైనా వర్చ్యువల్ ఐడీగా ఉండొచ్చు. ఉదాహరణకు మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయితే.. మీ ఐడీ రవిఎట్‌యాక్సిస్‌బ్యాంక్.కామ్‌గా ఉండొచ్చు.
 సంప్రదాయ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు యూపీఐకి తేడా ఏంటి?
 దేశంలో ఉన్న ప్రధానమైన ఈ-పేమెంట్స్ విధానాలు.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్), ఇమ్మిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్). వీటి ద్వారా డబ్బుల్ని పంపాలంటే బ్యాంక్ ఖాతా, ఓటీపీ, ఐఎఫ్‌ఎస్‌సీ వంటి తదితర నంబర్లు కావాలి. డబ్బు పంపించాలనుకుంటున్న వారి ఖాతాలను ముందుగా జత చేసుకోవాలి.

ఇంత చేసినా డబ్బు వెంటనే పంపగలమా? అంటే లేదు. సమయం పడుతుంది. ఇక వాలెట్లు అంటారా.. వాటిని క్రెడిట్, డెబిట్ కార్డులతో నింపుకుంటేనే పనిచేస్తాయి. యూపీఐలో ఇలాంటివేమీ ఉండవు.  వర్చ్యువల్ ఐడీ ఇచ్చామా.. ఎంపిన్ ఎంటర్ చేశామా.. అంతే లావాదేవీ క్షణాల్లో జరిగిపోతుంది. దీని ద్వారా నెలవారి బిల్లులను ఆటోమేటిక్‌గా క్రమం తప్పకుండా చెల్లించవచ్చు.

యూపీఐ ఆవిష్కరణ ఉద్దేశమేమిటి?
యూపీఐ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం దేశంలో క్యాష్ ఎకానమీని తగ్గించడం. అంటే ప్రజలు ప్రత్యక్ష నగదుపై ఆధారపడటాన్ని నిలువరించడం. ఈ లక్ష్యంతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గత నెలలో ఈ విధానాన్ని ఆవిష్కరించింది. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దాదాపు 18 శాతంమేర నగదు ప్రత్యక్షంగా (చేతి ద్వారా) వ్యవస్థలో చెలామణిలో ఉందని ఆర్‌బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

అంటే ప్రపంచంలో ఎక్కువగా ప్రత్యక్ష నగదుపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలో మనదీ ఒకటి. యూపీఐ విధానం వల్ల లావాదేవీలకు పట్టే సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని ఆర్‌బీఐ పేర్కొంటోంది. యూపీఐ వ్యవస్థ స్థిరీకరణకు 1-2 ఏళ్లు పట్టొచ్చని ఎన్‌పీసీఐ అభిప్రాయపడింది. బ్యాంకులు ఈ సేవలను కస్టమర్లకు అందించడానికి 1-2 నెలలు సమయం పట్టొచ్చు.
 
చెల్లింపుల నిర్వహణ ఇలా...
మీరు ఒక మాల్‌కు వెళితే అక్కడ మీ బిల్లు రూ.2,000 అయ్యింది. అప్పుడు మీరు క్యాష్ కౌంటర్‌లో కేవలం మీ వర్చ్యువల్ ఐడీ  చెబితే చాలు. అతను ఐడీ ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఒకే చేస్తే.. అంటే ఎంపిన్‌ను ఎంటర్ చేయగానే లావాదేవీ జరిగిపోయి.. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.
 
అదే మీరు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఒక వస్తువును కొంటున్నారనుకోండి. వస్తు ఎంపిక తర్వాత దాని బిల్లును చెల్లించడానికి ప్రస్తుతం సైట్‌లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. త్వరలో వీటితోపాటు యూపీఐ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు పేమెంట్ కోసం యూపీఐని ఎంచుకోవాలి. తర్వాత దానిలో మీ వర్చ్యువల్ ఐడీని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ స్క్రీన్ మీద ఒక పాప్‌అప్ వస్తుంది. దానిలో మీ ఎంపిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. బిల్లు చెల్లింపు జరిగిపోతుంది.
 
అలాగే మీరు మీ స్నేహితునికి డబ్బులు పంపించాలనుకుంటున్నారు. యూపీఐ ద్వారా అతనికి డబ్బుల్ని వెంటనే పంపొచ్చు. కానీ ఇక్కడ అతనికి కూడా వర్చ్యువల్ ఐడీ ఉండాలి. అంటే ఆయన బ్యాంకు కూడా యూపీఐ ప్లాట్‌ఫామ్‌లో భాగస్వామి అయ్యి ఉండాలి.  
 ఇక్కడ యూపీఐకి మరొక ప్రత్యేకత ఉంది. ఎన్ని బ్యాంకు అకౌంట్లున్నా కేవలం ఒకే ఒక యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు.

ఇక్కడ వర్చ్యువల్ ఐడీ మారుతుంది అంతే. ఉదాహరణకు రవికి రెండు బ్యాంకుల్లో ఖాతాలుంటే.. ప్రస్తుతం అతను ఆ రెండు బ్యాంకుల యాప్‌లను ఉపయోగిస్తూ ఉంటాడు. యూపీఐలో ఆ అవసరం లేదు. అన్ని బ్యాంకులు ఎన్‌పీసీఐతో భాగస్వామ్యమై ఉండటంతో ఒకే యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. అయితే వర్చ్యువల్ ఐడీలు అతనికి రెండు ఉంటాయి.
 బ్యాంక్ ఖాతా, కార్డు నంబర్ లాంటి ఎలాంటి వివరాలను తెలియజేయడం లేదు కాబట్టి సమాచార భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 
వాలెట్ల పనైపోయినట్లేనా?
దేశంలో మొబైల్ వాలెట్లకు ఆదరణ బాగుంది. వీటి ద్వారా జరిగే లావాదేవీలు అధికంగానే ఉన్నాయి. చాలా ప్రైవేట్ సంస్థలు వాలెట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంతెందుకు బ్యాంకులు కూడా ప్రత్యేకంగా వాలెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఫోన్ రీచార్జ్, టికెట్స్ బుకింగ్ వంటి తదితర అంశాలు వాలెట్ల ద్వారా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇక మీదటే.. వీటికి యూపీఐ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
 వాలెట్లలో డబ్బుల్ని నింపుకోవాలంటే.. అది డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారానే జరగాలి.

అలాగే ఒక సంస్థ వాలెట్ నుంచి మరొక సంస్థ వాలెట్‌కు డబ్బుల్ని పంపుకోలేం. యూపీఐ ద్వారా డెరైక్ట్‌గా డబ్బుల్ని ఇతరులకు, విక్రయదారులకు చెల్లించే వెసులుబాటు ఉన్నప్పుడు ప్రత్యేకంగా వాలెట్లలో డబ్బుల్ని నింపుకోవడం ఎందుకు? అప్పుడు వాలెట్లతో పనేముంటుంది. వాలెట్లలో రూ.10,000 మించి లావాదేవీలకు కేవైసీ వివరాలు తప్పనిసరి. యూపీఐలో రూ.1,00,000 వరకు నగదును ఇతరులకు పంపొచ్చు. అలాగే యూపీఐలో లావాదేవి విలువ రూ.0.45 కన్నా తక్కువగానే ఉంటుంది. యూపీఐ విస్తరణ, వినియోగం పెరుగుతున్న కొద్ది ఎస్‌బీఐ బుడ్డి, ఐసీఐసీఐ పాకే ట్స్‌సహా పేటీఎం వాలెట్లకు ఆదరణ తగ్గొచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ తన నివేదికలో తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement