వాష్టింగ్టన్: ఎటువంటి ఇబ్బందులూ లేకుండా దేశంలో వ్యాపార నిర్వహణ సరళత విషయంలో భారత్‌కు 130వ ర్యాంక్ లభించింది. గత ఏడాది ర్యాంకునే కొనసాగిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ వార్షిక నివేదిక తెలియజేసింది. అయితే గతంకంటే భారత్‌లో వ్యాపార నిర్వహణా పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్న నివేదిక, తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల చర్యలు, వృద్ధికి దోహదపడేవిగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటలైజేషన్, విద్యుత్ సరఫరా, తయారీ రంగానికి మద్దతు వంటి అంశాలకు సంబంధించి దేశం గడచిన రెండేళ్లలో వేగవంతమైన సంస్కరణల చర్యలను ప్రారంభించిందని పేర్కొంది.
ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వం భారత్ వ్యాప్తంగా వ్యాపార నిర్వహణా పరిస్థితులు మార్చాల్సిన అవసరంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని వివరించింది. వ్యాపారం ప్రారంభం, అనుమతులు, విద్యుత్, ప్రోపర్టీ రిజిస్ట్రేషన్, రుణ సౌలభ్యం, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ, పన్ను చెల్లింపులు, విదేశీ వాణిజ్యం, సకాలంలో కాంట్రాక్టుల అమలు, దివాలా సమస్యల పరిష్కారం వంటి పది అంశాల ప్రాతిపదికన ప్రపంచబ్యాంక్ ర్యాంకింగ్ ఉంటుంది. కాగా ప్రపంచ బ్యాంక్ నివేదిక పట్ల కేంద్రం నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది ర్యాంక్ మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.