
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.18 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలో వస్తువుల బాస్కెట్ ధర 2018 మార్చితో పోల్చిచూస్తే, 2019 మార్చి నెలలో టోకున 3.18 శాతం పెరిగిందన్నమాట. ఆహారం, ఇంధన ఉత్పత్తుల ధరల పెరుగుదలే దీనికి కారణం. సోమవారంనాడు కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
►ఈ ఏడాది జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.75 శాతం అయితే, ఫిబ్రవరిలో 2.93 శాతం. గత ఏడాది మార్చిలో ఈ రేటు 2.74 శాతంగా ఉంది.
►సూచీలో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ విభాగాన్ని చూస్తే, మార్చిలో ఈ రేటు 5.68 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.28 శాతం. కూరగాయల ధరలు భారీగా 28.13 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో ఈ రేటు కేవలం 6.82 శాతం కావడం గమనార్హం. ఆలూ ధరలు మాత్రం భారీగా తగ్గాయి. మార్చిలో ఈ పెరుగుదల శాతం కేవలం 1.3 శాతం మాత్రమే (2018 మార్చితో పోల్చి). అయితే ఫిబ్రవరిలో ఈ పెరుగుదల రేటు భారీగా 23.40 శాతం. పప్పు దినుసుల ధరల స్పీడ్ 10.63 శాతంగా నమోదయ్యింది. గోధుమకు సంబంధించి ద్రవ్యోల్బణం 10 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపలు వంటి ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 5.86 శాతంగా ఉంది. ఉల్లి ధరల్లో మాత్రం అసలు పెరుగుదల లేదు. పైగా ధరలు 31.34 శాతం తగ్గాయి. పండ్లకు సంబంధించి కూడా ధరలు 7.62 శాతం తగ్గాయి.
► ఇంధనం, విద్యుత్ విభాగానికి వస్తే, టోకు ద్రవ్యోల్బణం 5.41 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో ఈ రేటు 2.23 శాతం. డీజిల్ ధరల పెరుగుదల రేటు ఫిబ్రవరిలో 3.72 శాతం ఉంటే, మార్చిలో ఈ రేటు ఏకంగా 7.33 శాతానికి పెరిగింది. పెట్రోల్ ధరలు 1.78 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో ధరలు అసలు పెరక్కపోగా 2.93 శాతం తగ్గాయి.