
యస్ బ్యాంక్ లాభం రూ. 914 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని యస్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 30 శాతం పెరిగింది. మొండిబకాయిలు పెరిగినా, బ్యాంక్ లాభం ఈ స్థాయిలో పెరగడం విశేషం. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.702 కోట్లుగా ఉన్న తమ నికర లాభం(స్టాండలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 30 శాతం వృద్ధితో రూ.914 కోట్లకు ఎగసిందని యస్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం, నికర వడ్డీ ఆదాయం, నిర్వహణలాభం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ రాణా కపూర్ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.1,640 కోట్లకు పెరగ్గా, నికర వడ్డీ మార్జిన్ 3.6 శాతంగా ఉందని, ఈ స్థాయి నిమ్ సాధించడం ఇదే తొలిసారని చెప్పారు.
మొత్తం ఆదాయం 29 శాతం అప్..
మొత్తం ఆదాయం రూ.4,331 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.5,606 కోట్లకు చేరిందని రాణా కపూర్ పేర్కొన్నారు. స్థూల మొండిబకాయిలు రూ.1,006 కోట్ల(0.76%) నుంచి రూ.2,019 కోట్లకు(1.52%), నికర మొండిబకాయిలు రూ.343 కోట్ల(0.29%) నుంచి రూ.1,072 కోట్లకు(0.81%) పెరిగాయని వివరించారు. కేటాయింపులు రూ.186 కోట్ల నుంచి రూ.310 కోట్లకు ఎగిశాయని తెలిపారు. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించడానికి బోర్డ్ ఆమోదించింది. గత ఆర్థిక సంవత్సరానికి గా ను ఒక్కో షేర్‌కు రూ.12 చొప్పున తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కపూర్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో యస్ బ్యాంక్ షేర్ స్వల్ప నష్టంతో రూ.1,605 వద్ద ముగిసింది.