యస్ బ్యాంక్ లాభం 28% అప్
క్యూ4లో రూ.551 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ యస్ బ్యాంక్ మార్చి క్వార్టర్‌లో(2014-15, క్యూ4) రూ.551 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.430 కోట్లతో పోలిస్తే 28.1 శాతం వృద్ది చెందింది. వడ్డీ ఆదాయం జోరు.. డిపాజిట్లు, రుణాల్లో ప్రగతి ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. క్యూ4లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.3,014 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పెరిగింది. 22 శాతం వృద్ధి నమోదైంది.
ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 35 శాతం పెరిగి రూ.977 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 32% వృద్ధితో రూ.590 కోట్లకు చేరాయి. మొండిబకాయిల విషయానికొస్తే.. నికర నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) అంతక్రితం ఏడాది క్యూ4లో 0.05% కాగా, ఈ క్యూ4లో 0.41%కి ఎగబాకాయి. స్థూల ఎన్‌పీఏలు కూడా 0.31% నుంచి 0.41 శాతానికి పెరిగాయి.
విదేశీ, స్వదేశీ మార్కెట్లలో షేర్ల విక్రయం ద్వారా బిలియన్ డాలర్ల మేరకు(దాదాపు రూ.6,200 కోట్లు) నిధులను సమీకరించడంపై దృష్టిసారించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. క్విప్/జీడీఆర్‌లు/ఏడీఆర్‌ల రూపంలో ఒకటి లేదా పలు విడతల్లో షేర్ల విక్రయం ఉండొచ్చని తెలిపింది. బుధవారం బీఎస్‌ఈలో బ్యాంక్ 1.43% పెరిగి రూ.796 వద్ద ముగిసింది.