
యువతే.. లగ్జరీ కార్ల కస్టమర్లు
లగ్జరీ కార్ల విక్రయాల్లో ఆడి కొత్త రికార్డు నమోదు చేసింది. 2013-14లో భారత్‌లో ఏకంగా 10,126 కార్లను విక్రయించి అగ్ర స్థానానికి ఎగబాకింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల విక్రయాల్లో ఆడి కొత్త రికార్డు నమోదు చేసింది. 2013-14లో భారత్‌లో ఏకంగా 10,126 కార్లను విక్రయించి అగ్ర స్థానానికి ఎగబాకింది. ఒక ఏడాదిలో 10 వేల లగ్జరీ కార్ల మార్కును దాటిన తొలి కంపెనీగా వినుతికెక్కింది. తమ బ్రాండ్‌కు ఉన్న ఆదరణే ఇందుకు నిదర్శనమని అంటున్నారు ఆడి ఇండియా హెడ్ జో కింగ్. యూత్ ఐకాన్‌గా ఆడి నిలిచిందని, తమ కస్టమర్ల సరాసరి వయసు 30-35 ఉంటోందని చెప్పారు. లగ్జరీ కార్ల మార్కెట్ తీరుతెన్నులు, కస్టమర్ల అభిరుచుల గురించి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లున్న కారు కావాలని కస్టమర్లు కోరుకుంటున్నారు కదా. మీరేమంటారు?
మా అనుభవం ప్రకారం భారతీయ కస్టమర్లు డబ్బుకు తగ్గ విలువను కోరుకుంటారు. ధర ఏమాత్రం ప్రాధాన్యత కాదు. ఎక్కువ ధర చెల్లించే ముందు ఫీచర్లు, కారు పనితీరు బాగుందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. ఖరీదైన మోడళ్లకు మళ్లిన మా కస్టమర్లే ఇందుకు నిదర్శనం.
రూ.20-25 లక్షల ధరగల కారు తెచ్చే ఆలోచన ఉందా?
కొన్ని కంపెనీలు తక్కువ ఫీచర్లతో కింది స్థాయి కస్టమర్ల కోసం మోడళ్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఆ వ్యూహం పెద్దగా విజయవంతం కాలేదు. భారతీయ కస్టమర్లు వివేకవంతులు. తక్కువ ధర ఉన్న కార్లను పరిచయం చేయాలన్న వ్యూహానికి మేము దూరంగా ఉంటున్నాం. పోటీ కంపెనీతో పోలిస్తే ఎక్కువ ఫీచర్లు, అధిక ధరతో ఆడి క్యూ3 అనే మోడల్‌ను ప్రవేశపెట్టాం. ఈ మోడల్‌కు అద్భుత స్పందన ఉంది.
ఆడి ఏ3 సెడాన్ ఎప్పుడొస్తోంది?
ఈ ఏడాది చివర్లో ఆవిష్కరిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్ హల్‌చల్ చేస్తోంది. భారత్‌కు ఇది సరైన మోడల్ అని భావిస్తున్నాం. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త విభాగాన్ని సృష్టించడం ఖాయం. ఎక్కువ మంది అభిమానులను సంపాదిస్తాం. కాంపాక్ట్ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్, ఎంట్రీ లగ్జరీ సెడాన్‌కు మధ్యస్తంగా ఉంటుంది.
చిన్న పట్టణాల్లో డిమాండ్ ఎలా ఉంది?
లగ్జరీ కారును సొంతం చేసుకోవాలన్న ఆకాంక్ష చిన్న పట్టణాల్లో అధికమవుతోంది. ఈ అంశమే దేశంలో ఖరీదైన కార్లకు డిమాండ్‌ను పెంచుతోంది. ద్వితీయ, తృతీయ పట్టణాల్లో లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల(ఎస్‌యూవీ) పట్ల మనసు పారేసుకుంటున్నారు. అవకాశాలను గుర్తించే ఈ ఏడాది ప్రారంభంలో వైజాగ్, ఉదయ్‌పూర్, నాసిక్ నగరాల్లో షోరూంలను తెరిచాం. ఇటువంటి పట్టణాలే లగ్జరీ హబ్‌లుగా నిలుస్తున్నాయి. 33 డీలర్‌షిప్‌లకుగాను ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే ఎక్కువగా ఏర్పాటు చేశాం. సంవత్సరాంతానికి మరో 7 ప్రారంభిస్తాం. ఇక 1,000 ఆడి కార్లు తిరుగుతున్న నగరంలో ప్రీ-ఓన్డ్ కార్లను విక్రయించే ఆడి అప్రూవ్డ్ ప్లస్ షోరూంలను తెరుస్తున్నాం. హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేస్తాం.
కార్ల మార్కెట్ తిరోగమనంలో ఉన్నా లగ్జరీ విభాగం మాత్రం వృద్ధిలో ఉండడానికి కారణం?
సంపన్నుల లైఫ్‌స్టైల్ మారుతోంది. భారతీయ మిలియనీర్ సరాసరి వయసు గతంలో 50 ఉంటే, నేడు 35-40 ఏళ్లకు వచ్చింది. యువ వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు పెరుగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే లగ్జరీ కార్లకు గిరాకీ ఉంటోంది. ఆడి కస్టమర్ సరాసరి వయసు 30-35 ఉంది. పారిశ్రామికవేత్తలే కాదు వారి పిల్లలు కూడా ఆడి కార్లను ఇష్టపడుతున్నారు. మా వినియోగదార్లలో అత్యధికులు సొంతంగా కారు నడిపేవారే. ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మళ్లుతుండడం స్పష్టంగా కనపడుతోంది.
భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
కొన్ని దేశాల్లో లగ్జరీ కార్ల అమ్మకాలు స్తంభించాయి. ఈ విభాగం వృద్ధికి భారత్ ఇప్పుడు దోహదం చేస్తోంది. 2013లో దేశవ్యాప్తంగా 6 శాతం వృద్ధితో 30-31 వేల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. రూపాయి పతనం, పెరుగుతున్న ఇంధన ధరలు మొత్తం వాహన పరిశ్రమపై ప్రభావం చూపిస్తున్నాయి. విదేశీ మారకం ఒడిదుడుకులకు లోనవడంతో తయారీ, నిర్వహణ వ్యయాలు పెరిగాయి. దీంతో ధరలను స్థిరీకరించాం. మే 1 నుంచి కార్ల ధరలు సరాసరి 3 శాతం పెంచాం. ఇక భారత్‌లో పోటీ విపరీతంగా ఉంది. కొత్త కంపెనీలు, కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి. విభిన్న మోడళ్లు, మంచి నెట్‌వర్క్, విక్రయానంతర సేవలు, సుశిక్షితులైన సిబ్బందితో మార్కెట్ వాటాను కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ఆడి ఫైనాన్స్ ఎలాగూ కస్టమర్లకు తోడుగా నిలుస్తోంది.