
న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జడ్‌ఈఈఎల్) నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో 38 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.625 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.386 కోట్లకు తగ్గిందని జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,785 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.2,035 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ పునీత్ గోయెంకా తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.1,147 కోట్ల నుంచి రూ.1,386 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.
చందా, ప్రకటనల ఆదాయాలు పెరుగుతాయ్ !
బ్రాడ్‌కాస్ట్ వ్యాపారం మంచి వృద్ధిని సాధించిందని పునీత్ వివరించారు. ప్రకటనల, చందా ఆదాయాలు పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకటనల ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.1,211 కోట్లకు, చందా ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.608 కోట్లకు ఎగసిందని వివరించారు. భవిష్యత్తులో ప్రకటనల, చందా ఆదాయాలు మరింతగా వృద్ధి చెందగలవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 6.3 శాతం లాభపడి రూ.459 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment