ప‌దేళ్ల బాలుడు పది ల‌క్ష‌లు కొట్టేశాడు | 10 Year Old Steals Rs 10 Lakh In Bank In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

బ్యాంకులో నోట్ట క‌ట్ట‌లెత్తుకెళ్లిన బాలుడు

Published Wed, Jul 15 2020 8:04 PM | Last Updated on Wed, Jul 15 2020 8:08 PM

10 Year Old Steals Rs 10 Lakh In Bank In Madhya Pradesh - Sakshi

ఇండోర్‌: అంద‌రూ చూస్తుండ‌గానే ప‌దేళ్ల బాలుడు ప‌ది ల‌క్ష‌లు కాజేసిన షాకింగ్ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. నీమూచ్ జిల్లాలోని జ‌వ‌ద్ ప్రాంతంలో ఓ కార్పొరేటివ్ బ్యాంకు ఉంది. బుధ‌వారం ఉదయం 11 గంట‌ల ప్రాంతంలో ఈ బ్యాంకులోకి అంద‌రూ క‌స్ట‌మ‌ర్ల‌తోపాటు ఓ బాలుడు ప్ర‌వేశించాడు. అయితే రాగానే నెమ్మ‌దిగా వెళ్లి క్యాషియ‌ర్ క్యాబిన్‌లోకి దూరి ఓ మూల‌కు న‌క్కాడు. ఎదురుగా బారెడంత క్యూ ఉన్నా వారెవ‌రికీ ఈ బ‌క్క‌ప‌లుచ‌ని బుడ్డోడు క‌నిపించ‌లేదు. పైగా అక్క‌డ క్యాబిన్‌లో స‌ద‌రు ఉద్యోగి లేక‌పోవ‌డంతో దొరికిందే చాన్స‌ని అక్క‌డున్న 500 నోట్ల క‌ట్ట‌ల‌ను దొరికిన కాడికి అందుకున్నాడు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి క్ష‌ణ‌మాల‌స్యం చేయ‌కుండా ఉడాయించాడు. (కరోనా : భార్య శాంపిల్స్‌ పనిమనిషి పేరుతో.. )

చోరీ అంతా కేవ‌లం ముప్పై సెక‌న్ల‌లోనే పూర్తి చేసేయ‌డం విశేషం. అయితే ఆ పిల్లవాడు బ్యాంకు నుంచి అడుగు బ‌య‌ట‌పెట్టే ముందు అలార‌మ్ మోగింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బ్యాంకు గార్డు అత‌ని వెన‌కాలే ప‌రిగెత్తాడు, కానీ అప్ప‌టికే ఆ బుడ్డోడు జారుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులకు స‌మాచార‌మివ్వ‌గా వారు బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీలించారు. అందులో ఆ పిల్ల‌వాడికి బ్యాంకులో ఉన్న మ‌రో వ్య‌క్తి స‌హ‌క‌రించిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై జ‌వ‌ద్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ ఓపీ మిశ్రా మాట్లాడుతూ.. "మైన‌ర్ బాలుడుతోపాటు, అత‌నికి స‌హ‌కరించిన వ్య‌క్తి వేర్వేరు దారుల్లో ప‌రిగెత్తారు. ఆ ప్రాంతంలో రోడ్ల ప‌క్క‌న ఉండే దుకాణాదారుల‌ను దీని గురించి ప్ర‌శ్నిస్తున్నాం. సెక్యూరిటీ గార్డును సైతం విచారిస్తున్నాం" అని తెలిపారు. (ఆన్‌లైన్ క్లాసుల‌ని ఫోన్ ఇస్తే ఏకంగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement