
లక్నో : దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై అత్యాచార పర్వాలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలపైనే కాకుండా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు వారిని హతమార్చి మానవత్వానికి మచ్చతెస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాలో మృగాడు. అనంతరం ఇటుకలతో ఆమె తల పగులగొట్టి పాశవికంగా హతమార్చాడు. శుక్రవారం సఫీపూర్‌లో జరిగిన ఈ ఘటన బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ..‘ మేమంతా ఆరు బయటపడుకున్నాం. కాసేపటి తర్వాత నా కూతురు కనిపించలేదు. వాష్‌రూంకి వెళ్లిందేమో అనుకున్నాం. కానీ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వెదికాం. ఇంటికి కొద్ది దూరంలో నగ్నంగా పడి ఉన్న తనను చూసి ఒక్కసారిగా నా గుండె పగిలిపోయింది. తన శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. తలను ఛిద్రం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఉన్నావ్ ఎస్పీ తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment