
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ కరోనా మరణమృదంగం మోగిస్తున్నా.. చాలామంది కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ముందుజాగ్రత్త చర్యగా కనీసం మాస్కు ధరించేందుకూ ఇష్టపడటం లేదు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నా.. వీరిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా నగరవాసుల్లో ఈ నిర్లక్ష్యపు పోకడ మరీ అధికంగా ఉంది. మాస్కులు ధరించని వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి విపత్తుల నిర్వహణ చట్టం 51(బి) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నా.. పలువురు బేఖాతరు చేస్తున్నారు. మార్చి 30వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు మాస్కులు ధరించని వారిపై మొత్తం 42,999 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌లోనే 10,441 కేసులు నమోదయ్యాయి. ఇక రాచకొండ (2,007), సైబరాబాద్ (1,992)లతో కలిపి 14,440 కేసులు ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌వే కావడం గమనార్హం. ఇక తరువాత ఉల్లంఘనల్లో రామగుండం (5,810), వరంగల్ (3,082) కమిషనరేట్లు నిలిచాయి. అతి తక్కువగా మహబూబ్‌నగర్ (91), నారాయణపేట్ (72), వనపర్తి (28)లో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment