వివాదాస్పద స్థలం ఇదే
దుండిగల్: చనిపోయిన వ్యక్తి స్థానంలో మరో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుతో పాటు నకిలీ దస్తావేజులను సృష్టించి స్థలాన్ని విక్రయించిన ఏడుగురు వ్యక్తులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులోనూ టీఆర్‌ఎస్ పార్టీ బహిష్కృత నేత, మాజీ కార్పొరేటర్ సురేష్‌రెడ్డి ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం. సీఐ శంకరయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ముంబైలో ఉంటున్న సాయిప్రసాద్ చౌదరికి సూరారం కాలనీ సర్వే నెంబరు 44 ప్లాట్ నంబర్ 55లో 230 గజాల స్థలం ఉంది. సాయిప్రసాద్ చౌదరి 2017, జులై 25న అనారోగ్యంతో మృతి చెందడంతో సదరు భూమిపై కన్నేసిన అతని దూరపు బంధువు సూరారం ప్రాంతానికి చెందిన బాలాజీ దానికి కాజేసేందుకు దమ్మాయిగూడకు చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ బ్రహ్మ మధుకుమార్, జ్ఞానేశ్వర్‌తో కలిసి కుట్రపన్నాడు. ఇందుకుగాను సాయిప్రసాద్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకుని జ్ఞానేశ్వర్ పేరున నకిలీ పత్రాలు సృష్టించారు.
అనంతరం మాజీ కార్పొరేటర్ సురేష్‌రెడ్డిని కలిసి విషయం చెప్పడంతో ఆయన ఇది సరైన పద్దతి కాదని చెప్పి మరో పథకం రచించాడు. ఇందులో భాగంగా సూరారం ప్రాంతానికి చెందిన పుసులూరి వెంకటేశ్వరరావును రంగంలోకి దింపాడు. చనిపోయిన సాయిప్రసాద్ పేరుతో వెంకటేశ్వరరావు ఫొటో, చిరునామాతో ఆధార్ కార్డును రూపొందించాలని తన అనుచరుడు మాదాని విజయ్‌కుమార్ ను పురమాయించడంతో అతను సుభాష్‌నగర్‌కు చెందిన మీసేవా నిర్వాహకుడు షేక్‌బాబా వలీతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేయించాడు. అనంతరం వెంకటేశ్వరరావును సాయిప్రసాద్‌గా నమ్మించి ఫోర్జరీ సంతకాలతో నకిలీ దస్తావేజులు సృష్టించారు. సదరు స్థలాన్ని విక్రయించే బాధ్యతను గాజులరామారం ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ సత్యనారాయణకుఅప్పగించారు. సత్యనారాయణ కావలి శ్రీశైలం అనే వ్యక్తికి సదరు స్థలాన్ని అమ్మేలా ఒప్పందం కుదుర్చుకుని సురేష్‌రెడ్డికి రూ. 5 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వగా, సురేష్‌రెడ్డి స్థలాన్ని అమ్మినట్లు సేల్ అగ్రిమెంట్ చేశాడు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
ఈ విషయం యూఎస్‌ఏలో ఉంటున్న సాయిప్రసాద్ బావ కోనేరు వీరభద్రరావుకు తెలియడంతో నెల రోజుల క్రితం ఆయన మెయిల్ ద్వారా దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి స్థలాన్ని విక్రయించినట్లు తేలింది. దీంతో నిందితులు మధుకుమార్, వెంకటేశ్వరరావు, షేక్ బాబావలీ, విజయ్‌కుమార్, సత్యనారాయణ, వీరికి సహకరించిన సయ్యద్ రజీవుద్దీన్, వెంకటరమణ మూర్తి లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలాజీ, జ్ఞానేశ్వర్ పరారీలో ఉండగా సురేష్‌రెడ్డి ఫోర్జరీ డాక్యూమెంట్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సురేష్‌రెడ్డిపై నాలుగు భూకబ్జా కేసులు ఉండడంతో అతడిని కస్టడీకి అప్పగించాలని దుండిగల్ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment