లభించిన పుర్రె, ఎముకలు
భువనేశ్వర్/ఢెంకనాల్ : గత 4 నెలలుగా కనిపించకుండా పోయిన వ్యక్తి పుర్రె, ఎముకలు బుధవారం బయటపడ్డాయి. వీటి దగ్గర లభించిన పర్సు, నగదు ఆధారంగా మరణించిన వ్యక్తిని బారొకొటొ గ్రామంలోని మల్‌ఝొరొనా వీధిలో ఉంటున్న విజయ్ కొడాగా గుర్తించారు. ఆయన అన్న రౌతు కొడా కూడా గతంలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఢెంకనాల్ జిల్లా పర్‌జంగ్ పోలీస్ స్టేషన్ పరిధి అంబొపొలాస గ్రామం జీడి తోటలో యువకుడి పుర్రె, ఎముకల్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో మృత యువకుని పుర్రెతో 28 ఎముకలు లభించాయి.
మృతుడు తాల్చేరులో లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రూ.11 వేలు తీసుకుని 4 నెలల కిందట ఇంటి నుంచి బయల్దేరాడు. అది మొదలుకొని విజయ్ కొడా ఆచూకీ లభించక కుటుంబీకులు అల్లాడి పోయినప్పటికీ ప్రయోజనవ లేకపోయింది. కుటుంబీకుల ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. పుర్రె, ఎముకల్ని స్వాధీనం చేసుకుని వైజ్ఞానిక పరీక్షల కోసం కటక్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వైజ్ఞానిక బృందం వెళ్లి వీటిని ప్రాథమికంగా పరిశీలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment