నగదును పరిశీలిస్తున్న ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ
కొత్తగూడెం: క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే, విద్యాబుద్ధులు నేర్పే పవిత్రబాధ్యతల విభాగంగా కీర్తించుకునే విద్యాశాఖలో గంజాయి మొక్క మాదిరిగా కొత్తగూడెంలో ఓ ఉద్యోగి వ్యవహరించాడు. సాక్షాత్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కట్టగురు సైదులు రూ.25వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు. పాల్వంచకు చెందిన శ్రీలక్ష్మీ చిల్డ్రన్స్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు 2015–16కు ముగియడంతో..పునరుద్ధరించాలని యజమాని బతుత్లు ఆంథోని డిసౌజ జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
పూర్తి స్థాయి డీఈఓ లేకపోవడంతో.. ఆ ఫైల్ సీనియర్ అసిస్టెంట్ కట్టగురు సైదులు వద్దకు రాగా..ఐదేళ్లు రెన్యువల్ చేసేందుకు రూ. 25వేలు లంచం డిమాండ్ చేశాడు. కేవలం 30 మంది విద్యార్థులే ఉన్నారని, అంత ఇచ్చుకోలేనని అనడంతో ఏడాదిగా తిప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు. విసిగిపోయిన బాధితుడు..ఏసీబీ ఖమ్మం, వరంగల్ డీఎస్పీ బీవీ.సత్యనారాయణను ఆశ్రయించాడు. ఆయన సూచన ల మేరకు..సైదులుకు పాఠశాల యజమాని ఫోన్ చేసి డబ్బు ఇచ్చేందుకు అంగీకరించగా డీఈఓ ఆఫీస్ మార్గం లోని ఆలయం వద్దకు రమ్మనడంతో అక్కడ డబ్బు ముట్టజెప్తుండగా ఉదయం 11గంటల సమయంలో రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం డీఈఓ ఆఫీస్‌కు తరలించి..విచారించారు. కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బీవీ.సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే 94404 46146 సెల్‌నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
ప్రతి పనికో రేటు..
ఖమ్మం జిల్లా డీఈఓనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడ ఉండని కారణంగా పర్యవేక్షణ కొరవడింది. సీనియర్ అసిస్టెంట్ కట్టగురు సైదులు..లంచం తీసుకుంటూ పట్టుబడడంతో విద్యాశాఖ కార్యాలయంలో లొసుగులపై చర్చ జరుగుతోంది. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడం నుంచి మొదలు..ప్రతి పనికీ ఇక్కడ ఓ రేటు మాట్లాడుకుంటారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు, ప్రైవేట్ పాఠశాలల పనులకు కచ్చితంగా డబ్బు చెల్లించుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. కస్తూర్బా పాఠశాలల బిల్లుల మంజూరులోనూ అంతోఇంతో ఇచ్చుకోవాల్సిందేనట. అవినీతి మరకలు పడడం బాధాకరమని, ఇకపై ఇలా జరగకుండా, పద్ధతిగా వ్యవహరించుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామాచారి, ఇతర ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించారు. ఇటు కార్యాలయ పాలన గాడిలో పెట్టాలన్నా, అటు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ పెరగాలన్నా పూర్తిస్థాయి డీఈఓ నియామకం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment