కరీమాబాద్: ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ సమీపంలోని దుబ్బగుట్ట వద్ద వరంగల్ ఎంజీఎం ప్రాంతానికి చెందిన వివాహిత బోయిన మాధురి అలియాస్ మాధవిపై యాసిడ్ (తేజాబ్) దాడి చేసిన నిందితులు మిల్స్‌కాలనీ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో నిందితులైన మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని సాకరాసికుంటకు చెందిన ఆటోడ్రైవర్ చందు, అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు రాకేష్‌లతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన మరో స్నేహితుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితురాలైన మాధురి బుధవారం మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎంజీఎం ప్రాంతం నుంచి ఆటోలో ఎక్కించుకుని ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి దుబ్బకుంట వద్ద మాధురిని చున్నీతో కట్టేసి, మోహంపై యాసిడ్‌పోసి(తేజాబ్) హతమార్చే ప్రయత్నం చేశారు. బాధితురాలు మాధురికి భర్తతో గొడవల కారణంగా గత కొంత కాలంగా వరంగల్ ఎంజీఎం వద్ద గల తన తల్లి వద్దే ఉంటుందని, ఈ క్రమంలో హంటర్ రోడ్‌లోని ఓ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తుండగా అక్కడ ఆటో డ్రైవ ర్ చందు పరిచయమయ్యాడు.
ఈ క్రమంలో వారిద్దరూ వేములవాడలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఐతే కొంతకాలం వారు కలిసి ఉండడం జరిగినా ఇటీవల ఎవరికీ చెప్పకుండా మాధురి చందు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పాటు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం.. తనకు ఒక పాప ఉందన్న విషయం ఆటో డ్రైవర్ చందుతో చెప్పక పోవడంతో మాధురిని ఎలాగైనా హతమార్చాలనే కుట్రతో ఇలా తన స్నేహితులు అనిల్, రాకేష్‌తో కలిసి ఆటో డ్రైవర్ చందు యాసిడ్(తేజాబ్) దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మాధురిని హతమార్చేందుకు వాడిన తేజాబ్‌ను చందుకు చెందిన మరో స్నేహితుడు అందించాడన్న ప్రచారం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి, ఎప్పుడు సేకరించాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సంఘటన పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
చికిత్స పొందుతున్న మాధురి మృతి
ఎంజీఎం: ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి సమీపంలోని చెట్లపొదల్లో యాసిడ్ దాడిలో తీవ్ర గాయాలపాలైన మాధురి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. బుధవారం ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మాధురికి వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికీ పరిస్థితి విషమంగా మారడంతో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా మాధురిని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి అనిరోజ్ క్రిస్టియాన్ సందర్శించి బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment