
చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పన్ను ఎగవేత విషయంలో అమలాపాల్ కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తప్పుడు చిరునామాను వినియోగించి గతేడాది ఆమె రూ. కోటి విలువజేసే కారును కొనుగోలు చేశారు.
దీంతో రూ. 20 లక్షల పన్ను ఎగవేసినందుకు కేరళ పోలీసులు అమలాపై కేసు నమోదు చేశారు. కేసు నమోదుతో షాక్‌కు గురైన ఆమె.. కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం ముందు పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ స్టేషన్‌లో అమలా లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాను కలిసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు.