
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గజల్ శ్రీనివాస్ రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలను బాధితురాలు తాజాగా విడుదల చేశారు. పనిమనిషి పార్వతి తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించడానికే.. మరిన్ని వీడియోలు విడుదల చేశానని ఆమె తెలిపారు. నా వద్ద ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని తెలిపారు.
గజల్ శ్రీనివాస్ గలీజ్ పనులకు సంబంధించి మొత్తంగా 20 వీడియోలను బాధితురాలు పోలీసులకు సమర్పించినట్టు తెలుస్తోంది. పనిమనిషి పార్వతే తనను గజల్ శ్రీనివాస్ వద్ద వెళ్లాలని బలవంతపెట్టేదని బాధితురాలు తెలిపారు. గజల్ శ్రీనివాస్ బారిన పడిన బాధిత మహిళలు చాలామంది ఉన్నారని, చాలామంది మహిళల జీవితాలను అతను నాశనం చేశాడని చెప్పారు. అతని వ్యవహారంపై రెండు నెలలుగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు బాధితురాలు వెల్లడించారు. గజల్ శ్రీనివాస్‌లాంటి మోసగాడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి మోసగాళ్లను వదిలేస్తే..మరింత మంది జీవితాలు నాశనమవుతాయని అన్నారు. తాజా వీడియోలు వెలుగుచూడటంతో గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరింతగా బిగుసుకున్నట్టయింది.
తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలోని ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసులో కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పనిమినిషిగా ఉన్న పార్వతి కూడా నిందితురాలిగా చేర్చారు.