వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సత్యయేసుబాబు, చిత్రంలో అదనపు ఎస్పీ చౌడేశ్వరి
సాక్షి, అనంతపురం సెంట్రల్: పెద్దల బండారం బట్టబయలైంది. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. క్లబ్బుల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన 14 స్థావరాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొన్నేళ్లుగా బహిరంగంగానే పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా క్లబ్బులు మారినా ఆ దరిదాపుల్లోకి కూడా పోలీసులు వెళ్లిన సందర్బాలు లేవు. అలాంటి వాటిపై ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు నేతృత్వంలో దాడులు నిర్వహించడం సర్వత్రాచర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు గురువారం స్థానిక పోలీసుకాన్ఫరెన్స్ హాల్లో విలేకరులకు తెలియజేశారు.
అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కుపాదం
అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కు పాదం మోపుతున్నామని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో క్లబ్బులపై ఏకకాలంలో దాడులు చేశామన్నారు. మిగిలిన చోట్ల నిందితులు పట్టుబడకపోయినా జిల్లా కేంద్రంలోని అనంతపురం క్లబ్‌లో పేకాట ఆడుతున్న 42 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,87,417 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీలులేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇసుక, రేషన్ బియ్యం, అక్రమ రవాణా, బెల్టు దుకాణాలు, మట్కా, పేకాట, క్లబ్‌లపై దాడులను ప్రాధాన్యతగా భావించి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 154 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, లారీలను పట్టుకుని 26 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 150 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 12 మంది నిందితులను అరెస్ట్ చేసి 337.6 క్వింటాళ్ల(564 బస్తాలు) రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. మట్కాపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి 27 కేసులు నమోదు చేయడంతోపాటు రూ.1,87,880 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాటకు సంబంధించి 553 కేసులు నమోదు చేసి రూ.9,97,240 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
పేకాటరాయళ్లను తరలిస్తున్న పోలీసులు
గుట్కా విక్రయాలపై 21 కేసులు నమోదు చేసి, 27 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.3,96,571ల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్టు దుకాణాలపై దాడులు చేసి 128 కేసులు 3,714 మద్యం సీసాలు, 149 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చౌడేశ్వరి పాల్గొన్నారు.
ముందస్తు సమాచారంతో తప్పించుకున్న పేకాటరాయుళ్లు
క్లబ్ బయట నిల్చున్న డీఎస్పీ శ్రీనివాసులు
సాక్షి, కదిరి: పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సీఆర్‌సీ క్లబ్‌పై గురువారం పోలీసులు మెరుపు దాడి చేసేందుకు వెళ్లారు. అయితే ముందస్తు సమాచారంతో పేకాటరాయుళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. గత నెల 27న ‘ఇక్కడ పేకాట మామూలే’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు గురువారం జిల్లా వ్యాప్తంగా పేకాట క్లబ్‌లపై మెరుపు దాడులు చేయించారు. కదిరిలో సీఆర్‌సీ క్లబ్‌పై కూడా దాడి చేయడానికి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ బీవీ చలపతి, ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ ఇంకా పలువురు పోలీసులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.
ఇంతలోనే విషయం సీఆర్‌సీ క్లబ్ సభ్యులకు పోలీసులే కొందరు సమాచారం అందించడంతో పేకాటరాయుళ్లు తప్పించుకున్నారు. ముందస్తు సమచారం లేకుంటే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అనుచరులు పట్టుబడేవారని కొందరు సీఆర్‌సీ క్లబ్ సభ్యులే అంటున్నారు. డీఎస్పీతో పాటు ఇతర కింది స్థాయి అధికారులు కాసేపు సీఆర్‌సీ క్లబ్ గేట్ ముందు గడిపి వెనుదిరిగారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..
నగరంలోని అనంతపురం క్లబ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ క్లబ్‌కు అధ్యక్షులు జిల్లా కలెక్టర్, ఉపాధ్యక్షులు ఎస్పీలు వ్యవహరిస్తారు. రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేసి క్లబ్ పేకాట, తాగుడుకు కేంద్రంగా మారింది. దీంతో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న వారు, రిటైర్డ్ ఉద్యోగులు, చోటామోటా నాయకులు, ప్రజాప్రతినిధులు వారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఎంచుకున్నారు. ఇక్కడ తాగడం, పేకాట ఆడడం లైసెన్స్‌గా భావించే పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు కొరడా ఝలిపించారు. డీఎస్పీ పీఎన్ బాబు ఆధ్వర్యంలో నాలుగు పోలీసుస్టేషన్‌ల అధికారులు క్లబ్‌పై మెరుపుదాడులు నిర్వహించారు. 42మంది అరెస్ట్ చేసి నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment