ఈ సైబర్‌ క్రైమ్‌.. ఓ మిస్టరీ.! | Assailant Come to the Flat and Hit the Debit Card | Sakshi
Sakshi News home page

ఈ సైబర్‌ క్రైమ్‌.. ఓ మిస్టరీ.!

Published Fri, Apr 13 2018 2:12 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

Assailant Come to the Flat and Hit the Debit Card - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇదో మిస్టరీ సైబర్‌ క్రైమ్‌.. నేరం జరిగింది.. కానీ అది ఎలా జరిగిందనే దానిపై పోలీసులకే స్పష్టత లేదు. రూమ్‌ అద్దెకు కావాలంటూ వచ్చిన నేరగాడు తన డెబిట్‌కార్డు తస్కరించాడని, ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ బగ్‌ ఇన్‌స్టాల్‌ చేశాడని బాధితుడు చెప్తున్నాడు. ఇలా తన ఖాతాలోని రూ.49,900 కాజేశాడని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బగ్గింగ్‌ లేదని, కేవలం తాత్కాలిక పిన్‌ నంబర్‌ సృష్టించాడని పోలీసులు అంటుంటే.. టెంపరరీ పిన్‌ సృష్టించడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మిస్టరీ సైబర్‌ క్రైమ్‌ను ఛేదించడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. 

గది అద్దెకు కావాలంటూ వచ్చి.. 
ఉత్తరాదికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్న హర్ష్‌ కరీవాల, వన్ష్‌ దత్తా, ఆకాశ్‌ గార్గ్‌ కొండాపూర్‌ రాఘవేంద్ర కాలనీలోని హ్యాపీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఒక్కో బెడ్‌రూమ్‌లో ఒకరు ఉండేవారు. ఇటీవల ఆకాశ్‌ వెళ్లిపోవడంతో ఓ బెడ్‌రూమ్‌ ఖాళీ అయింది. ఎవరికైనా ఈ రూమ్‌లోకి రావడానికి ఆసక్తి ఉంటే సంప్రదించాలంటూ హర్ష్‌, వన్ష్‌ ‘హైదరాబాద్‌ ఫ్లాట్‌ అండ్‌ ఫ్లాట్‌ మేట్స్‌’అనే ఫేస్‌బుక్‌ పేజ్‌లో గత శనివారం పోస్ట్‌ చేశారు. అది చూసిన ఓ వ్యక్తి అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో వన్ష్‌కు ఫోన్‌ చేశాడు. రమ్మని చెప్పడంతో పది నిమిషాల్లో ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తన పేరు శ్రీనివాసరెడ్డి అని, తిరుపతికి చెందిన తాను ఢిల్లీ, పుణేల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశానని, పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని గూగుల్‌ కార్యాలయంలో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఫ్లాట్‌ నచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో వచ్చి చేరుతానంటూ అడ్వాన్స్, అద్దె వివరాలు సైతం ఖరారు చేసుకున్నాడు. 

కార్డ్‌ కొట్టేసి.. ఫోన్‌ తీసుకుని.. 
వీరి ఫ్లాట్‌కు వస్తూనే తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిందంటూ చార్జర్‌ తీసి చార్జింగ్‌ పెట్టాడు శ్రీనివాసరెడ్డి. అద్దెకు రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలని హర్ష్‌కు చెందిన రూమ్‌లోకి వెళ్లాడు. హర్ష్‌, వన్ష్‌ హాల్‌లోనే ఉండటంతో అక్కడి వార్డ్‌రోబ్‌లో ఉన్న హర్ష్‌ పర్సు నుంచి అతడి డెబిట్‌ కార్డు తస్కరించాడు. ఏమీ ఎరుగనట్లు బయటకొచ్చి అతను ఫ్లాట్‌లోకి అద్దెకు వస్తున్న విషయం తన తల్లిదండ్రులకు చెప్పాలంటూ హర్ష్‌ నుంచి సెల్‌ఫోన్‌ తీసుకున్నాడు. ఫోన్‌ కలవట్లేదంటూ కాస్త దూరం వెళ్లిన అతడు.. వారికి ఎస్సెమ్మెస్‌ పంపిస్తున్నానంటూ మెసేజ్‌ టైప్‌ చేస్తున్నట్లు నటిస్తూ ఓ బగ్గింగ్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేశాడు. ‘పని’పూర్తయిన తర్వాత ఫోన్‌ ఇచ్చేసి రెండు రోజుల్లో ఫ్లాట్‌లో చేరతానంటూ చెప్పి వెళ్లిపోయాడు. 

ఏటీఎం నుంచి డబ్బు డ్రా.. 
హర్ష్‌  డెబిట్‌కార్డును తీసుకుని శ్రీనివాసరెడ్డి నేరుగా హైటెక్‌ సిటీలో ఉన్న ఓ ఏటీఎం వద్దకు వెళ్లాడు. డెబిట్‌ కార్డుతో డబ్బు డ్రా చేయాలంటే పిన్‌ నంబర్‌ కావాల్సిందే. దీనికోసం అతడు హర్ష్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన బగ్గింగ్‌ యాప్‌ను వాడుకున్నాడు. డెబిట్‌కార్డును ఏటీఎంలో పెట్టి పిన్‌ నంబర్‌ మార్చాలనే ఆప్షన్‌ ఎంచుకున్నాడు. సాధారణంగా ఇలా చేస్తే రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు సందేశం వస్తుంది. అయితే హర్ష్‌ ఫోన్‌లోని బగ్గింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కారణంగా ఈ సందేశం దుండగుడి ఫోన్‌కే వచ్చింది. అంతే పిన్‌ నంబర్‌ మార్చేసి మూడు విడతల్లో హర్ష్‌ ఖాతాలోని రూ.49,900 కాజేశాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో డబ్బు డ్రాకు సంబంధించిన సందేశాలు ఫోన్‌కు రావడంతో హర్ష్‌ కార్డు కోసం చూడగా అది కనిపించలేదు. ఫోన్‌ను సరిచూసుకోగా బగ్గింగ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ అయినట్లు ఉంది. దీంతో శ్రీనివాసరెడ్డిగా చెప్పుకుని వచ్చిన వ్యక్తే బాధ్యడని అనుమానించిన హర్ష్‌, వన్ష్‌ మరుసటి రోజు(ఆదివారం) గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

అదుపులో వరంగల్‌ వాసి.. 
గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించారు. వరంగల్‌కు చెందిన అతడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఎలాంటి బగ్గింగ్‌ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేయలేదని, హర్ష్‌కు చెందిన ఫోన్‌ ద్వారా తాత్కాలిక పిన్‌ నంబర్‌ సృష్టించానని, ఈ నంబర్‌ వ్యాలిడిటీ కొన్ని గంటలు ఉంటుందని, దాని ఆధారంగానే డబ్బు డ్రా చేసినట్లు అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. విషయాన్ని బాధితుడు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. టెంపరరీ పిన్‌ నంబర్‌ జనరేషన్‌ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. అయితే బగ్గింగ్‌ యాప్‌ విషయాన్ని పోలీసులు అంగీకరించట్లేదు. దీంతో ఈ కేసును సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఈ పంథాలో అనేక మందిని ముంచి ఉంటాడనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement