
గువాహటి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అసోంలో గురువారం కేసు నమోదైంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్సీ) పేరిట అసోం నుంచి బెంగాలీలను తరిమేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందన్న ఆమె ఆరోపణలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా మమత మాట్లాడారని గువాహటి, దిస్‌పూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మమత వ్యాఖ్యలను అసోం ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు అసోం ప్రజలు, భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కించపరిచేలా ఉన్నాయని, ఆమెకు వ్యతిరేకంగా సుప్రీంలో ఫిర్యాదు చేయాలని ఎన్‌ఆర్సీ అధికారులను కోరింది. అసోంలో పలు చోట్ల మమత దిష్టిబొమ్మలను దహనం చేశారు.
బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేసులకు భయపడి మమత తన పోరాటం ఆపరని టీఎంసీ తేల్చిచెప్పింది. రాజకీయ ప్రయోజనాల కోసమే మమత కొత్త సమస్యను సృష్టిస్తున్నారని బీజేపీ మండిపడింది. పశ్చిమబెంగాల్‌లోని అహ్మద్‌నగర్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ...ఎన్‌ఆర్సీ ముసాయిదాలో బెంగాలీల పేర్లు చేర్చకుండా వారిని అసోం నుంచి తరిమేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు గత డిసెంబర్ 31న ఎన్‌ఆర్సీ తొలి జాబితాను విడుదల చేయగా.. భారత పౌరులుగా సుమారు 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. 1.90 కోట్ల మందికి అందులో చోటు దక్కింది.