కొడుకు కాదు.. కర్కోటకుడు  | Atrocity on father in Tirupati | Sakshi
Sakshi News home page

కొడుకు కాదు.. కర్కోటకుడు 

Published Wed, Jun 5 2019 4:30 AM | Last Updated on Wed, Jun 5 2019 12:22 PM

Atrocity on father in Tirupati - Sakshi

కొడుకు దెబ్బలు భరించలేక విడిపించుకుందుకు యత్నిస్తున్న మునికృష్ణయ్యపై కారం చల్లుతున్న కోడలు నీరజ (ఇన్‌సెట్‌లో)గాయాలతో మునికృష్ణయ్య

తిరుపతి క్రైమ్‌:  మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి రాయలేదనే కోపంతో కని పెంచి, పోషించిన తండ్రిపైనే దాడికి తెగబడ్డాడు ఓ ప్రబుద్ధుడు. భార్య, బావమరిది సాయంతో తండ్రి కళ్లల్లో కారం చిమ్మి చచ్చేలా కొట్టాడు. ఈ దారుణ సంఘటన తిరుపతిలో మంగళవారం చోటుచేసుకుంది. వెస్ట్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి అనంతవీధిలో మునికృష్ణయ్య (80) భార్య కృష్ణవేణమ్మతో ఉంటున్నాడు. వీరికి విజయభాస్కర్, తులసీరామ్‌ అనే కుమారులు ఉన్నారు. కాగా, మునికృష్ణయ్య కొన్నేళ్ల క్రితం అప్పులు చేసి సొంత ఇంటిని కట్టుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు తులసీరామ్‌ను అన్న విజయభాస్కర్, వదిన నీరజ ఇంట్లో నుంచి తరిమేశారు. అయితే.. ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో పెద్ద కుమారుడు విజయ్‌భాస్కర్‌ కూడా తండ్రిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. తర్వాత చిన్న కుమారుడు తులసీరామ్‌ తల్లిదండ్రుల వద్దకు చేరుకుని, వారిని పోషించడంతోపాటు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీరుస్తూ వచ్చాడు.

అప్పులు తీరిపోతున్నాయని తెలుసుకున్న విజయ్‌భాస్కర్‌ భార్యతో కలిసి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. అప్పటి నుంచి విజయ్‌భాస్కర్‌ తన తల్లి కృష్ణవేణమ్మ పేరుపై ఉన్న ఇంటిని తనకు రాసి ఇవ్వాలని రోజూ గొడవ పడేవాడు. ఇంటికి చేసిన అప్పుల్లో కొంత తీర్చాలని విజయ్‌భాస్కర్‌ను తండ్రి మునికృష్ణయ్య కోరాడు. దీంతో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు విజయ్‌భాస్కర్‌ బావమరిది వంశీకృష్ణ తన బావకు సహకరిస్తూ గొడవలు పెద్దవి చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం మునికృష్ణయ్యతో పెద్ద కుమారుడు, కోడలు వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగక విజయ్‌భాస్కర్‌ చేతికందిన వస్తువులతో తండ్రిపై విచక్షణారహితంగా రక్తం వచ్చేలా దాడి చేశాడు. తానేమీ తక్కువ కాదన్నట్టు కోడలు నీరజ కూడా కారం పొడి తీసుకొచ్చి మామ కళ్లల్లో చల్లింది.

సమీపంలోని ఇరుగుపొరుగు వారు ఈ దారుణాన్ని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో నగరంలో కలకలం రేగింది. పెద్ద కుమారుడి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న మునికృష్ణయ్యను స్థానికులు వైద్య చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. అనంతరం స్థానికులు వెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విజయ్‌భాస్కర్‌ దాష్టీకాన్ని పోలీసులకు వివరించి మునికృష్ణయ్యకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించి విజయభాస్కర్, అతడి భార్య నీరజ, ఆమె తమ్ముడు వంశీకృష్ణపై కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement