చక్రధర్
విజయనగరం టౌన్: అబుదాబి, దుబాయ్ వంటి దేశాల్లో జరిగే ఘోర అకృత్యాలను తలపించే మృగాడి దాష్టీకం జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. వినడానికే జుగుప్స కలిగించే వేధింపులు, హింసలు ఇక్కడా మహిళలపై జరుగుతున్నాయని బయటపడటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. యువతులతో వ్యాపారం చేసే ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి గర్భం ధరించిన కోలకత్తాకు చెందిన నిషా పిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. స్పెషల్ బ్రాంచ్, వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ప్రాంతాలకు వెళ్లి, రెడ్ హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వన్‌టౌన్ ఎస్‌ఐ ఫక్రుద్దీన్ అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక లంకాపట్నానికి చెందిన ఆటోడ్రైవర్ బంగారు చక్రధర్‌కు లీల అనే యువతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వీరిద్దరూ కలిసి పట్టణంలోని ఉడాకాలనీ, వి.టి.అగ్రహారం, పూల్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.
అద్దెకున్న ఇళ్ల వద్ద బట్టల వ్యాపారం చేస్తున్నట్లు నటించి, ఆ మాటున వ్యభిచారం యధేచ్చగా సాగించారు. బట్టల కోసం కోలకత్తా అప్పుడప్పుడు వీరిద్దరూ వెళ్లేవారు. అక్కడ పరిచయమైన నిషాను తన వలలో వేసుకున్నాడు. వెళ్లి, వచ్చేటప్పుడల్లా తనతో ప్రేమాయణం సాగించేవాడు. అది ప్రేమగా మారి రోజూ ఫోన్లు చేసుకునేవారు, ఈలోగా తన పనిమీద ఆమె ఇటీవల శ్రీకాకుళం వచ్చింది. చక్రధర్ కూడా శ్రీకాకుళం వెళ్లాడు. ఆమెను పెళ్లిచేసుకుంటానని చక్రధర్ నమ్మించాడు. ఆ మాటలు నిషా నమ్మింది. మాయమాటలు చెప్పి విజయనగరంలోని ఉడాకాలనీలో గల ఒక ఇంటి వద్ద లక్ష్మి అనే మహిళను తోడుగా నిషాను ఉంచాడు. శారీరకంగా ఆమె వద్ద సుఖాలనుభవిస్తూ ఆమెను గర్భవతిని చేశాడు. ఆమె పెళ్లిచేసుకోవాలని చక్రధర్‌పై ఎంతగా ఒత్తిడి తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో తానెలా బతకాలని నిలదీసింది. చక్రధర్ తన నిజస్వరూపం బయటపెట్టి కావాలంటే వ్యభిచారం చేసుకుని బతకమన్నాడు. నిశ్చేష్టురాలైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. వన్‌టౌన్ ఎస్‌ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేసేది లేక పోలీసులకు పిర్యాదు
తన బతుకు బుగ్గిపాలైందని, ఎందరో బతుకులు తీసేస్తున్నాడని, తన బతుకు ఏమైనా పర్వాలేదు కానీ, మరే ఆడపిల్ల బతుకు పాడవ్వకూడదనే ఉద్దేశంతో నేరుగా జిల్లా ఎస్పీ జి.పాలరాజును ఈ నెల మూడో తేదీన కలిసి తనగోడు వెళ్లబుచ్చుకుంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విటుల్లా నటించి చక్రధర్‌కు ఫోన్ చేసి అమ్మాయిలు కావాలని ఎరవేశారు. అలా వలలో చిక్కిన చక్రధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అందులో మైనర్ బాలిక ఉండడంతో పోక్సో చట్టం కింద ఒక కేసు, అమ్మాయిని మోసం చేసిన దానిమీద మరో కేసు, వ్యభిచారంకింద మరో కేసు నమోదైంది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment