
చిలకలగూడ : అమ్మాయిని ఎరగా వేసిన ఓ ఆటో డ్రైవర్ ఓ వ్యాపారిపై దాడి చేసి అతని మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాంధీనగర్ ఎస్‌బీహెచ్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ వ్యాపారం చేసేవాడు. మెట్టుగూడ కేశవనగర్‌కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సంతోష్ అతడికి పాత పరిచయం ఉంది. ఈనెల 2న చంద్రశేఖర్‌కు ఫోన్ చేసిన సంతోష్ తన వద్ద ఓ అమ్మాయి ఉందని చెబుతూ తన ఇంటికి రప్పించాడు.
అతడి ఇంటికి వెళ్లిన చంద్రశేఖర్‌ను లోపలికి తీసుకువెల్లి కర్రతో వెనుక నుంచి దాడి చేశాడు. కిందపడిపోయిన అతడి మెడలోని నాలుగుతులాల బంగారు గొలుసు లాక్కుని బయటి నుంచి తలుపు గడియపెట్టి అక్కడినుంచి పరారయ్యాడు. బాధితుడి కేకలు విన్న స్థానికులు తలుపులు తీయడంతో బయటికి వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.