
మిర్యాలగూడ అర్బన్: ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఎస్‌కే జానీ ఆటో డ్రైవర్. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది నెలల క్రితం పద్మప్రియ ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకుని సొంతంగా ఆటోను కొనుక్కున్నాడు. కంపెనీకి ప్రతినెలా రూ.6,500 కిస్తీ చెల్లిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఒక్క నెల కిస్తీ చెల్లింపులో ఆలస్యమైంది. దీంతో ఫైనాన్స్ నిర్వాహకులు తరచూ జానీ ఇంటికి వచ్చి ఫైనాన్స్ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు.
కాగా ఐదు రోజులు సమయం ఇవ్వాలని, బాకీ ఉన్న కిస్తీ మొత్తం చెల్లిస్తానని జానీ వేడుకున్నాడు. కానీ ఫైనాన్స్ నిర్వాహకులు వినిపించుకోలేదు. శుక్ర వారం ఉదయం జానీ ఇంటికి వచ్చి ఆటోను తీసుకెళ్లారు. ఫైనాన్స్ డబ్బులు చెల్లించి ఆటో తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన జానీ, ఫైనా న్స్ కార్యాలయానికి వెళ్లి తనవెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే మంటలను ఆర్పారు. 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తర లించారు. 60% కాలిన గాయాలతో ఉన్న జానీ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. జానీకి భార్య ముంతాజ్, కుమారుడు సమద్, కూతురు సన ఉన్నారు. భార్య ముంతాజ్ ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫైనాన్స్ నిర్వాహకులు కనికరించలేదు
ఒక్క నెల వాయిదా కట్టనందుకే ఫైనాన్స్ వారు ఇబ్బందులకు గురి చేశారని జానీ భార్య ముంతాజ్ పేర్కొన్నారు. కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం మొత్తం ఆటోపైనే ఆధారపడి జీవనం సాగిస్తోందని వాపోయారు. ఇప్పుడు తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని, తన భర్తను ఎలా కాపాడుకోవాలో తెలియడంలేదని ఆమె కన్నీరుమున్నీరైంది.