పోలీసులు అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలు, చిన్నారులు, యువకులు
విశాఖ రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం కలకలం రేగింది. ఆడ పిల్లల అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగిన నగర పోలీసులు రైల్వే అధికారులను సంప్రదించి ట్రైన్ సమాచారాన్ని తెలుసుకున్నారు. స్టేషన్‌కు ఆ రైలు రాగానే పోలీసులు హుటాహుటిన ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకుని విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారని నిర్థారించుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఒకే దేశానికి చెందిన వారని ప్రాథమికంగా తెలిసినా.. అందులో వాస్తవమెంత.? అసలు వీరంతా ఎవరు..? దేశంలో ఎందుకు అనధికారికంగా నివసిస్తున్నారు..? ఉగ్ర సంబంధాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అకస్మాత్తుగా ప్లాట్‌ఫారమ్‌పై పోలీసులు ప్రత్యక్షమవ్వడం... రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం.. వారిలో చిన్నారులు, మహిళలు ఉండటంతో.. విశాఖ రైల్వే స్టేషన్‌లో ఒకింత ఉద్రిక్తతతో కూడిన ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
సాక్షి, విశాఖపట్నం : మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం... ప్రశాంతంగా ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న 12864 నంబర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏడో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే పోలీసులు ప్లాట్‌ఫారమ్‌ను ఆక్రమించుకున్నారు. సివిల్ పోలీసులతోపాటు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది చుట్టుముట్టారు. ట్రైన్ ఆగిన వెంటనే సోదాలు మొదలు పెట్టిన పోలీసులకు 16 మంది విదేశీయులు చిక్కారు. మొదట్లో వీరంతా ఉగ్రవాద ముఠాకు చెందిన వారుగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఠాలో చిన్నారులు, మహిళలు కూడా ఉండటంతో మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. వారందరినీ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఆర్‌పీఎఫ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఒక్కొక్కరి వద్ద నుంచి వివరాలు సేకరించారు. వీరంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారని ముందుగా గుర్తించారు. వీరిలో మహిళలు, పిల్లలు సహా మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురికి మినహా.. మిగిలిన వారెవ్వరికీ బంగ్లాదేశ్ పౌరసత్వానికి సంబంధించిన గుర్తింపు పత్రాలుగానీ, పాస్‌పోర్టులు కానీ లేవు. దీంతో పాస్‌పోర్టు ఉన్న వారిని పూర్తిస్థాయి విచారణ చేపట్టి వివరాలు సేకరించి విడిచిపెట్టారు. మిగిలిన 9 మందిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు భార్య భర్తలమనీ, ముగ్గురు పిల్లలు వారిలో రెండు జంటలకు చెందిన వారని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరెవ్వరికీ ఉగ్రమూకలతో సంబంధాలు లేవని నిర్థారించుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
దినసరి కార్మికులా..? చొరబాటుదారులా..?
పట్టుబడ్డ బంగ్లాదేశీయలు పోలీసుల విచారణలో పలు వివరాలు వెల్లడించారు. తామంతా బెంగళూరులో దినసరి కార్మికులుగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నామనీ.. మరో చోటికి వలస వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్నామని చెప్పినట్లు సమాచారం. అయితే వీరంతా ఎప్పుడు దేశంలోకి వచ్చారు...? ఇన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ నివసించారు...? ఆయా ప్రాంతాల్లో ఏం పనులు చేశారు..? మొదలైన విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరంతా నిజంగా బంగ్లా నుంచి పనులు కోసం వచ్చిన దినసరి కూలీలా..? లేదంటే అక్రమ చొరబాటుదారులా..? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే అనధికారికంగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు ఖాళీ చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి అసోం తదితర ప్రాంతాల మీదుగా భారత్‌కు వచ్చిన అక్రమ చొరబాటుదారుల్ని గుర్తించి, తిరిగి పంపించి వెయ్యాలంటూ దేశ అత్యున్నత ధర్మాసనం కేంద్రాన్ని 2014లో ఆదేశించింది. అయినప్పటికీ ఇంకా చొరబాట్లు జరుగుతున్నాయన్న అనుమానాలకు తాజా సంఘటన మరింత బలాన్ని చేకూర్చింది. అయితే వీరు దేశంలోకి ఏ మార్గం గుండా ప్రవేశించారు..? ఎప్పుడు వచ్చారన్న విషయాలు విచారణలో తెలుసుకున్నాక పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అప్పగిస్తామని నగర పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా తెలిపారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న 9 మంది బంగ్లాదేశీయులను కంచరపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment