ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి మృతికేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయినట్టు ఫోరెన్సిక్ నివేదికలు ధ్రువీకరించాయి. అప్పటికీ వరకు ఉత్సాహంగా ఆడిపాడుతూ.. కనిపించిన శ్రీదేవి ఉన్నఫలాన బాత్‌టబ్‌లో పడి చనిపోవడమేమిటి? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బాత్‌టబ్ మరణాలు అనేవి భారతీయులకు కొత్త కావొచ్చు. ఇలాంటి మరణాలు దాదాపు మనదేశంలో చోటుచేసుకోవు కాబట్టి.. ఇదంతా విస్మయం కలిగించవచ్చు. కానీ విదేశాల్లో ఇలాంటి విషాదాలు సాధారణమే.ముఖ్యంగా జపాన్, అమెరికాలో బాత్‌టబ్ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి.
జపాన్‌లో బాత్‌టబ్ సంబంధిత మరణాలు జాతీయ విషాదంగా మారాయి. ఏడాదికి 19వేల మరణాలు ఇలా సంభవిస్తున్నట్టు 2017 మార్చిలో జర్నల ఆఫ్ జనరల్ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ పత్రికలో ఓ అధ్యయనం వెల్లడించింది. గడిచిన పదేళ్లలో ఈ తరహా మరణాలు 70శాతం వరకు పెరిగాయని, ఈ మరణాల్లో ప్రతి పదింటిలో తొమ్మిదిమంది 65 ఏళ్లకుపైగా వృద్ధులే ఉంటున్నారని జపాన్ వినియోగదారుల వ్యవహారాల ఏజెన్సీ 2016లో పేర్కొంది. జపనీయులు 41 సెల్సియస్‌కుపైగా వేడినీళ్లతో స్నానం చేయడం, బాత్‌టబ్‌ల లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఇందుకు కారణం.
2006లో అమెరికా ఫెడరల్ మోర్టాలిటీ డాటా ప్రకారం బాత్‌టబ్, హాట్‌టబ్, స్పా వంటి వల్ల రోజుకొకరు మృతిచెందుతున్నారు. మృతుల్లో అత్యధికులు డ్రగ్స్, మద్యం మత్తులో చనిపోతున్నారని తెలిపింది. 2015లో ఇళ్లలో ఉండే బాత్‌రూమ్‌లు ప్రమాదకరంగా మారాయని అట్లాంటాలోని సెంటర్ ఫర్ డీసిసెస్ కంట్రోల్ పేర్కొంది. 15 ఏళ్లకుపైగా ఉన్న రెండు లక్షలమంది ప్రతి ఏడాది బాత్‌రూమ్ గాయాలకు గురవుతున్నారని,అందులో 14శాతం మంది ఆస్పత్రి పాలవుతున్నారని తెలిపింది.
ఇక, భారత్‌కు వస్తే బాత్‌రూమ్ (మరుగుదొడ్డి) ప్రమాదాల గురించి పెద్దగా అధ్యయనాలు జరిగింది లేదు. మరుగుదొడ్లలో చోటుచేసుకుంటున్న పడటాలు, జారిపడటాల వల్ల మహిళలు, పురుషులు గాయపడుతున్నారని మనదేశపు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ ప్రమాదాలను కూడా ఇంటిలో జరిగే ప్రమాదాలు కాలిపోవడం, విద్యుత్‌షాక్ తగలడం వంటివాటిలో కలిపి పరిగణిస్తున్నారు. బాత్‌రూమ్ ప్రమాదాల వల్ల దేశంలో చనిపోయినట్టు దాఖలాలు లేవు.
పలువురు ప్రముఖులూ..
హాలీవుడ్ నటుడు జిమ్ మారిసన్ (28) బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. 1971లో పారిస్‌లో అతను బాత్‌టబ్‌లో విగతజీవిగా కనిపించాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు కానీ.. డ్రగ్స్ అధికంగా సేవించడం వల్ల చనిపోయినట్టు భావించారు.
అమెరికా పాప్ గాయని విట్నీ హుస్టన్ కూడా 2012లో తన హోటల్ గదిలో బాత్‌టబ్‌లో విగతజీవిగా కనిపించింది. అధిక డ్రగ్స్ వల్ల ఆమె మరణించినట్టు తెలుస్తోంది.
ప్రముఖ గాయకులు బాబీ బ్రౌన్, విట్నీ హుస్టన్ దంపతుల కుమార్తె బాబీ క్రిష్టా బ్రౌన్ కూడా 2015లో అపస్మారక స్థితిలో బాత్‌టబ్‌లో పడిపోయి ప్రాణాలు విడిచింది. మద్యం, మెడిసిన్స్ వల్ల ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.
నటుడు, గాయకుడు జ్యూడీ గార్లాండ్ కూడా 1969లో బాత్‌టబ్‌లో ప్రాణాలు విడిచాడు.
Comments
Please login to add a commentAdd a comment