భోపాల : పెళ్లి చేసుకోవాలని ఓ మోడల్‌ను నిర్భంధించి వేధించిన యువకుడికి పోలీసులు తగిన బుద్ది చెప్పారు. దాదాపు 12 గంటల తర్వాత ఆ సైకోలవర్ చెర నుంచి యువతిని రక్షించారు. భోపాల్‌లోని మిస్ రోడ్ ప్రాంతంలోని ఓ భవనంలో రోహిత్ సింగ్ (30) అనే యువకుడు మోడల్‌ను నిర్బంధించి దారుణంగా హింసించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పోలీసులతో వీడియో కాల్‌లో మాట్లాడి తన డిమాండ్లు వెల్లడించాడు. అతడి బారి నుంచి యువతిని పోలీసులు చాకచక్యంగా విడిపించారు. అనంతరం భోపాల్ వీధుల్లో రోహిత్ సింగ్‌ను నడిపించి మహిళలతో చెప్పులతో కొట్టించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరు పరిచామని, ఒకరోజు కస్టడీకి తీసుకున్నామని పోలీస్ అధికారి సంజీవ్ చౌసీ తెలిపారు. అతడిపై హత్యాయత్నం తదితర కేసులు కూడా నమోదుచేసినట్టు వెల్లడించారు. అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టరైన రోహిత్‌తో బాధితురాలికి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది.
ఉరిశిక్ష విధించాలి: బాధితురాలు
నిందితుడికి ఉరిశిక్ష విధించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ముంబైలో పరిచయమైన అతడు తొలుత తనను ఇబ్బంది పెట్టలేదని, గత నవంబరు నుంచి పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చింది. బాండ్ పేపర్‌పై లిఖితపూర్వకంగా రాసివ్వాలని బలవంతం చేసినట్టు కూడా ఆమె ఆరోపించింది. రోహిత్‌ను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అతడ్ని జైలు పంపి ఉరిశిక్ష విధించాలని, లేకపోతే తనను చంపేస్తాడని వాపోయింది. ఆమెపై నిందితుడు కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తనను వివాహం చేసుకోపోతే కాల్చి చంపి, తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని రోహిత్ బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి తుపాకి, రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విడిచిపెడితే ఎలాంటి హాని తలపెట్టబోమని పోలీసులు సర్దిచెప్పడంతో యువతిని వదలడానికి అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment