హత్యకు భార్యే సూత్రధారి | BJP Leader Murder Attempt Case Reveals East Godavari Police | Sakshi
Sakshi News home page

హత్యకు భార్యే సూత్రధారి

Published Wed, Jun 6 2018 7:04 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

BJP Leader Murder Attempt Case Reveals East Godavari Police - Sakshi

హత్యాయత్నం కేసులో నిందితులను చూపుతున్న పోలీసులు

సీలేరు (విశాఖ): విశాఖ ఏజెన్సీ సీలేరులో బీజేపీ నాయకుడు, వ్యాపారి కారె అప్పలరాజుపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీ వీడింది. అప్పలరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అతడిని హత్య చేయించేందుకు భార్యే కుట్ర పన్నిందని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులను జీకేవీధి సీఐ నారాయణరావు, సీలేరు ఎస్సై విభూషణరావు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామానికి చెందిన నేమాల శ్రీనివాస్‌ (చిన్నా)కు అప్పలరాజు భార్య మహేశ్వరికి వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో భార్యను అప్పలరాజు వేధించేవాడు. ఈ విషయాన్ని ఆమె శ్రీనివాస్‌కు ఎన్నోసార్లు చెప్పడంతో అతడిని అడ్డుతొలగించేందుకు ఇద్దరు ఈ నెల ఒకటిన కుట్రపన్నారని సీఐ, ఎస్సై వివరించారు.

జేసీబీ ఆపరేటర్లతో..
అప్పలరాజును హత్యచేయించేందుకు తన దగ్గర జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న విశాఖ జిల్లా కోటవురట్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొరుప్రోలు ప్రసాద్‌ (25), సర్వసిద్ధి దుర్గ (22)ను  శ్రీనివాస్‌ ఒప్పించాడు. దీంతో వారు ఈ నెల ఒకటిన ఉదయం 11 గంటలకు సీలేరు చేరుకున్నారు. సాయంత్రం వరకు రెక్కీ నిర్వహించారు. అదేరోజు రాత్రి భోజనంలో అప్పలరాజుకు భార్య మహేశ్వరితో నిద్రమాత్రలు కలిపి పెట్టించారు. అర్ధరాత్రి వరకు ఇంటి గోడ వద్ద వేచి ఉన్నారు. అప్పటికే మహేశ్వరి గేటు తాళం తీసి ఉంచింది. ఇంట్లో కుక్కను వెనుకవైపు కట్టింది. చుట్టుపక్కల వారు నిద్రించారని తెలుసుకున్న వారిరువురు ఇంట్లోకి ప్రవేశించారు. దుకాణంలో నిద్రిస్తున్న అప్పలరాజు కాళ్లను ఒకరు పట్టుకుని వృషణాలు నొక్కేందుకు ప్రయత్నించారు. మరో వ్యక్తి మెడకు చీర బిగించి చంపేందుకు ప్రయత్నించారు.

కేకలు వేయడంతో పరారీ..
అప్పలరాజు కేకలు వేయడంతో కాళ్లు పట్టుకున్న వ్యక్తి పరారయ్యాడు. ప్రసాద్‌తో అప్పలరాజు పెనుగులాడుతూ కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు రావడంతో అతను కూడా పరారయ్యాడు. ఈ క్రమంలో వారు టీషర్ట్, చెప్పులు, హత్యాయత్నానికి ఉపయోగించేందుకు తెచ్చిన సిరంజి వదిలి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన దుర్గ వారి ఇంటిపక్కనే వాహనంలో దాక్కొన్నాడు. ప్రసాద్‌ పారిపోయాడు. వెంటనే అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు
రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్, దుర్గ వదిలి వెళ్లిన దుస్తులు, పరిసర ప్రాంతీయుల సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టారు. సీలేరు సమీపంలోని మైదాన ప్రాంతాల్లోకి పారిపోతుండగా దుర్గ, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో శ్రీనివాస్‌ పరారీలో ఉండగా, భార్య మహేశ్వరి, ప్రసాద్, దుర్గలను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించామని సీఐ, ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement