ఒంగోలు క్రైం: జిల్లాలోనే సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నగరానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి గుర్రం ప్రణవ్ గురువారం సాయంత్రం కిడ్నాపైన విషయం తెలిసిందే. ఏడు గంటల్లోపే పోలీసులు బాలుడిని రక్షించి నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలంయలోని ఐటీ కోర్ సెంటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో పాల డెయిరీ నిర్వహిస్తున్న గుర్రం ప్రసాద్ ఒంగోలు నగరం లాయర్‌పేటలో నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమారుడు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు.
రాత్రి ఏడు గంటలకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే గురువారం అర్ధరాత్రి రెండు గంటలకే కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి తండ్రి ప్రసాద్ వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ వసీం అక్రమ్ ప్రధాన నిందితుడిగా గుర్తించి కటకటాల వెనక్కి నెట్టారు. బాలుడి తండ్రిని రూ.70 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు ఆ డబ్బులు తీసుకునేందుకు గుంటూరు నగర శివారు ఫ్లయి ఓవర్ వద్దకు వచ్చారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలేనికి చెందిన బోడా పవన్ సాయికుమార్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన మాజీ డ్రైవర్ షేక్ వసీం అక్రమ్‌తో పాటు బంగారం పనిచేస్తున్న లాయర్‌పేటకు చెందిన ఆదిమూలపు ఈశ్వరాచారి (ఇతనే బాలుడిని కారులో బలవంతంగా ఎక్కించింది), ఒంగోలు బాలాజీ నగర్‌కు చెందిన పాండురంకి ధనుంజయరావు, ప్రధాన నిందితునికి తెలిసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వీరంతా ముందు రోజు గద్దలగుంట పరిసరాల్లో రహస్య ప్రదేశంలో ఉండి పథక రచన చేశారు.
రెండు బ్యాచ్‌లుగా ఏర్పడిన నిందితులు
బాలుడిని కిడ్నాప్ చేసిన షేక్ వసీం అక్రమ్ ముఠా రెండు బ్యాచ్‌లుగా ఏర్పడ్డారు. ఫోన్ చేసి డబ్బులు కోసం బెదిరిస్తోంది ఒక బ్యాచ్. బాలుడిని కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తరలించింది మరో బ్యాచ్. బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాత బాలుడి ఇంటి వద్ద ఒక మహిళను రహస్యంగా కాపలా పెట్టారు. కారులో డబ్బు తీసుకొని ప్రసాద్‌తో పాటు మరో వ్యక్తి తన ఇంటి వద్ద కారు ఎక్కితే వెంటనే ఆ మహిళ నిందితులకు ఫోన్ చేసింది. వంటరిగా రమ్మంటే కారులో మరో వ్యక్తి ఎందుకు వస్తున్నారంటూ కిడ్నాపర్లు మళ్లీ బాలుడి తండ్రికి ఫోన్ చేశారు. అంటే కిడ్నాపర్లు ఎంతటి నెట్‌వర్క్ ఉపయోగించారో అర్థమైంది. ఆ తర్వాత రూ.70 లక్షలు కాకున్నా ఎంతో కొంత తొలుత ఇవ్వాలని, లేకుంటే బాలుడిని చంపేస్తామని బెదిరించడం ప్రాంరంభించారు.
ప్రసాద్ ఫోన్ బిజీ వస్తే ఏం పోలీసులకు ఫోన్ చేస్తున్నావా.. అయితే నీ కుమారుడు నీకు దక్కడని బెదిరించారు. చివరకు గుంటూరు నగరం శివారులో ఫ్లయి ఓవర్ వద్ద డబ్బు కోసం వచ్చిన పవన్ సాయి కుమార్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎనిమిది పోలీస్ బృందాలు వలపన్ని పట్టుకున్నారు. అతడితో బాలుడు ఉన్న కిడ్నాపర్లకు పోలీసులు ఫోన్ చేయించారు. బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడాలని, లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని డీఎస్పీ బి.శ్రీనివాసరావు కిడ్నాపర్లను హెచ్చరించడంతో అర్ధరాత్రి 2.30 నుంచి 3 గంటల మధ్యలో ఇంటికి సమీపంలో బాలుడిని వదిలి పారిపోయారు.
పోలీసులకు అభినందనలు
ఏడు గంటల్లోపే బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఒన్‌టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్, రూరల్ సీఐ ఎం.మురళీకృష్ణ, ఎస్‌ఐలు నాయబ్ రసూల్, మస్తాన్‌వలి, ప్రసాద్, రాజారావు, సురేష్, ఖాదర్ బాషా, ఏఎస్‌ఐ బాబూరావు, హెచ్‌సీ మాల్యాద్రి, కానిస్టేబుళ్లు అహ్మద్ బాషా, రమేష్, సురేష్‌తో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నగదు బహుమతులు అందించి ప్రోత్సహించారు.
ఎస్పీకి కృతజ్ఞతలు: ప్రసాద్, బాలుడి తండ్రి
మా కుమారుడిని సురక్షితంగా అప్పగించిన ఎస్పీ బి.సత్య ఏసుబాబుకు కృతజ్ఞతలు. కిడ్నాపర్లు డబ్బులు తీసుకురమ్మన్న చోటుకు అర్ధరాత్రి 12 గంటలకు చేరుకున్నాం. నేను ఒంటరిగా కారు నడుపుకుంటూ వెళ్తుంటే వెనుక సాధారణ వ్యక్తులు మాదిరిగా ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు బృందం నన్ను అనుసరించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు విపరీతమై చలిని కూడా లెక్కచేయకుండా డీఎస్పీ, ఆయన సిబ్బంది మా బిడ్డను కాపాడేందుకు పడిన కష్టం చెప్పలేనిది. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టిన అందరికీ కృతజ్ఙతలు.
Comments
Please login to add a commentAdd a comment