ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యాదాద్రి : లంచం.. లంచం.. ప్రభుత్వ శాఖల్లో ఏ స్థాయిలో చూసినా, ఏ నోటా విన్నా ఇదే పదం..! నెలనెలా వేలకువేలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు.. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అవకాశం దొరికిందం టే అందిన కాడికి దండుకుందామని అక్రమ మా ర్గాలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి పనికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు.
వారు అడిగినంత ఇచ్చుకోకపోతే ఫైల్ కదపరు. ఇదీ.. జిల్లాలో పలు శాఖల్లో నడుస్తున్న తంతు. వారి వేధింపులు తాళలేక, అడిగినంత ఇచ్చుకోలేక విధిలేని పరిస్థితుల్లో బాధితులు ఏసీబీ గడప తొక్కుతున్నారు. అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుపాలవుతున్నా సదరు వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. జైలుకు వెళ్లడం, బెయిల్‌పై రావడం, తిరిగి విధుల్లో చేరడం ఒక ప్రక్రియగా మారిపోయింది.
నిఘా పెంచిన ఏసీబీ
జిల్లాలో అన్ని స్థాయిల్లోని ఉద్యోగులపై ఫిర్యాదులు లేకపోలేదు. ఇటీవల కాలంలో పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ముందు ఇళ్లు, భవన నిర్మాణాల అనుమతుల కోసం కార్యదర్శులు, ఈఓపీఆర్‌డీలు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.దీంతో పాటు ట్రాన్స్‌కో, సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయాల్లోనూ సిబ్బంది అక్రమాలకు పాల్ప డుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి అనుమతి కోసం ఈనెల 1న చౌటుప్పల్ ఈఓపీఆర్డీ ఓ వ్యక్తి నుంచి రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన మరువక ముందే రెండు రోజుల క్రితం భువనగిరి సబ్‌డివిజన్ టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ అవినీతి నిరోధక శాఖకు పట్టబడడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరికొందరిపైనా ఫిర్యాదులు అందినందున నిఘా కొనసాగుతోందని ఏసీబీ అధికారి ఒకరు చెప్పారు.
డబ్బు లేనిదే పని జరగదు
ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికీ లంచం తీసుకోవడం ప్రక్రియగా మారిపోయింది. డబ్బు లేని దే పనులు జరగడం లేదు. రెండున్నరేళ్ల కాలంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనం. 2015లో 21 మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా 2016లో తొమ్మిది చిక్కారు. 2017లో ఏడుగురు, 2018లో ఇప్పటి వరకు ఆరుగురుని వలపన్ని పట్టుకున్నా రు.
ఇప్పటి వరకు ఏసీబీకి పట్టుబడిన వారిలో విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగులే ఉన్నారు. వీరితోపాటు సబ్‌ట్రెజరీ, సబ్‌రిజిస్ట్రార్, ఆర్టీఏ, నీటి పారుదల శాఖ, సివిల్ సప్లయ్, చేనేత జౌళి శాఖ, విద్యాశాఖ, ఎక్సైజ్, టౌన్‌ప్లానింగ్, పోలీసు, ఇంజనీరింగ్ శాఖలు, దేవాదాయ శాఖల అధికారులపైనా ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా లంచాలు..!
జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు మెజార్టీగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరిలో చాలా వరకు తమ అక్రమ లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలను హైదరాబాద్‌లోనే చేపడుతుంటారు. భువనగిరి సబ్ డివిజన్ టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ దుర్గారావు హై దరాబాద్‌లోనిలో గల తన నివాసంలో ఆ సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. పలు శాఖల అధి కారులు హైదరాబాద్‌లోని హోటళ్లు, తమ నివాస గృహాలకు లంచాలు ఇచ్చే వారిని రప్పించుకుని తీసుకోవడం పరిపాటిగా మారింది.
ఏజెంట్ల ద్వారా లంచాల స్వీకరణ
పలు శాఖల్లో పనుల కోసం నేరుగా వెళ్లే వారికి జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కొంత మంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా లంచాలు నిర్ణయించుకుని పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీకి చిక్కకుండా ఉండేందుకు ఎక్కువ మంది ఈమార్గాన్ని ఎంచుకున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు నడుస్తున్న తంతు.. ఏసీబీ అధికారుల దృష్టికి సైతం రావడంతో వారు పరిశీ లన జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment