సాక్షి, హైదరాబాద్ : పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల నిందితుడు,హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ముగ్గురు విద్యార్థినులను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌రెడ్డివిగా ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ తేల్చింది. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్ సిగ్నల్స్‌ను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. నేర నిరూపణ కావడానికి కావాల్సిన బలమైన సాక్ష్యాధారాలను అన్నిటినీ కోర్టుకు పోలీసులు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని హజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాంగం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment