
సంఘటనా స్థలం వద్ద గుమిగూడిన స్థానికులు
లక్నో : తమతో గొడవకు దిగారన్న కోపంతో! కక్ష్య గట్టిన కొంతమంది ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు. రోడ్డుపై వెళుతున్న కారును ఆపుచేసి అందులో ఉన్న అన్నదమ్ములను విచక్షణా రహితంగా కొట్టి తుపాకులతో కాల్చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్నోకు చెందిన ఇమ్రాన్ అలి, అర్మాన్ అలి అన్నదమ్ములు. వీరిద్దరూ క్యాబ్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వీరికి అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులతో గొడవ జరిగింది. ఆ తర్వాత ఆరుగురు.. ఇమ్రాన్, అర్మాన్‌ల ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి క్యాబ్‌లో వస్తున్న వీరిని నడిరోడ్డుపై అడ్డగించిన దుండగులు విచక్షణా రహితంగా కొట్టి నాటు తుపాకులతో కాల్చి చంపారు.
గొడవ జరుగుతున్న సమయంలో కారులో ఉన్న ఇమ్రాన్, అర్మాన్‌ల మిత్రుడు నిశాంత్ అక్కడి నుంచి పారిపోయి వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యతో సంబంధం ఉన్న ‘‘చోటు’’ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment