
జిన్నారం (పటాన్‌చెరు): ఓ లేబర్ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి కాల్చి దహనం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి మండలం, కాయపల్లి గ్రామానికి చెందిన కుసుమ ఆదినారాయణ(36) కుటుంబం బతుకుదెరువు కోసం జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామానికి వలస వచ్చింది. ఇక్కడి పారిశ్రామికవాడ లోని ఓ పరిశ్రమలో లేబర్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసేవాడు.
బుధవారం రాత్రి లేబర్ కోసం ఓ వ్యక్తిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి 12 గంటలైనా తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు ఆదినారాయణకు సెల్‌ఫోన్‌కు చేయడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. మరుసటి రోజు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం కనిపించడంతో కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించగా.. అది ఆదినారాయణ మృతదేహంగా గుర్తించారు. బీరు బాటిళ్లను నోట్లో, మెడపై గుచ్చి, పెట్రోల్ పోసి కాల్చి చంపేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరో కక్షపూరితంగానే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment