
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తెహ్రి జిల్లా సూర్యధర్ సమీపంలో బస్సు లోయలో పడి 10 మంది మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు 25 మంది ప్రయాణికులతో ఉత్తరకాశి నుంచి హరిద్వార్‌కు బయలుదేరింది. బస్సు రిషికేశ్- గంగోత్రి హైవేపై సూర్యధర్ సమీపంలోకి రాగానే అదుపు తప్పి 250 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించడానికి సంఘటన స్థలానికి హెలికాప్టర్లను పంపనున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. కాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ప్రమాదంలో మరణించిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొంది.