ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): తన లిక్కర్ మాఫియాను కాపాడుకునేందుకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేసిన హంగామాపై పోలీసు యంత్రాంగం సీరియస్ అయ్యింది. రెండు రోజులుగా మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీల్లోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల ఎదుట ఎమ్మెల్యే వెలగపూడితో పాటు ఆయన అనుచరులు హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. తన బినామీ బార్‌లపై ఎక్సైజ్ అధికారులు బ్రాండ్ మిక్సింగ్ కేసు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని వెలగపూడి అక్రమ కేసులు పెట్టారంటూ రెండు రోజుల పాటు హంగామా చేశారు.
శనివారం రాత్రి ఎంవీపీ కాలనీలోని సర్కిల్–2 ఎక్సైజ్ పోలీసు స్టేషన్ ఆవరణలో రాత్రి నిద్ర చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే తమ విధులకు ఆటంకం కల్పించారని సర్కిల్–2 స్టేషన్ సీఐ పాపునాయుడు ఆదివారం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఫిర్యాదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడిపై ఐపీసీ సెక్షన్ 353, 501 కింద ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కల్గించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎంవీపీ పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment