సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఒకే పంథాలో వరుస మోసాలకు పాల్పడుతున్న ‘గ్రేట్ చీటర్’ అఫ్తాబ్ అహ్మద్ షేక్ చిక్కడం ఒక ఎత్తయితే... అతడిని విచారించడం మరో ఎత్తు. ఇంటరాగేషన్ చేయడానికి ప్రయత్నించే పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు. మరోపక్క ఈ ఘరానా నేరగాడు అనేక సందర్భాల్లో ‘ప్లీడెడ్ గిల్టీ’ విధానం అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాదిరిగా తయారయ్యే అఫ్తాబ్ ఎదుటి వారిని బురిడీ కొట్టించడానికి ముందు వారి మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితి, అవసరాలను అధ్యయనం చేసిన తర్వాతే టార్గెట్‌ను ఎంపిక చేసుకుంటాడు. మాటలతో గారడీ చేసి తన ‘పని’ పూర్తి చేసుకుంటాడు. ఈ పంథాలో రెచ్చిపోయే అఫ్తాబ్‌ను పట్టుకోవడం సైతం పోలీసులకు సవాలే. పాతబస్తీలోని రెయిన్‌బజార్ ప్రాంతంలో ఇతడి నివాసం ఉన్నప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో? ఎవరిని మోసం చేస్తాడో? తెలియని పరిస్థితి. కొన్ని రోజుల పాటు అతడి ఇంటి వద్ద కాపుకాస్తే తప్ప పట్టుకోలేరు.
రమ్మంటే రక్తం వస్తుంది...
ఇంత కష్టపడిన పోలీసులు అఫ్తాబ్‌ను పట్టుకున్నప్పటికీ అతడిని పూర్తిస్థాయిలో విచారించడం, కాజేసిన డబ్బు/సొత్తు రికవరీ చేయడం అంత తేలికకాదు. శరీర అవయవాలతో పాటు రక్తం కూడా అతడి ‘చెప్పు చేతల్లోనే’ ఉండటం దీనికి ప్రధాన కారణం. పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించిన వెంటనే తాను చేసిన నేరాల చిట్టా విప్పుతాడు. రికవరీ కోసం సిద్ధమవుతున్నారనే సరికి అఫ్తాబ్‌కు ‘అనారోగ్యం’ వచ్చేస్తుంది. తొలుత కళ్లు తేలేయడంతో పాటు ఏదో ఒక చేతికి పక్షవాతం వచ్చినట్లు వంచేస్తాడు. ఆపై నోరు, చెవి నుంచి రక్తం కారేలా చేస్తాడు. దీనిని చూసిన పోలీసులు ఏదో జరుగుతోందనే భయంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అతడికి ఏం జరిగిందనేది గుర్తించడానికి వైద్యులు అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుందంటారు. అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాని నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం అతడు కోలుకున్నాక జైలుకు తరలించేస్తారు. గత ఏడాది ఓ ప్రత్యేక విభాగానికి చిక్కినప్పుడు అఫ్తాబ్ ఇదే పంథా అనుసరించి రికవరీలు ఇవ్వకుండా తప్పించుకున్నాడు. తాజాగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినప్పుడూ ఇదే ‘మంత్రం’ ప్రయోగించాడు. దీంతో అధికారులు ఇతగాడిని పాతబస్తీలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అసలు విషయం గుర్తించి చెప్పడంతో తమదైన శైలిలో విచారించిన టాస్క్‌ఫోర్స్ మొత్తం 18 తులాల బంగారం రికవరీ చేయగలిగింది.
లాయర్ ఖర్చులు, ఎన్‌బీడబ్ల్యూలు నో...
సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులు ప్రాథమికంగా ఓ లాయర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఆయన ద్వారా బెయిల్ తీసుకుని కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఇలా హాజరుకాకుంటే ఆ నిందితుడిపై న్యాయస్థానం నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కే అఫ్తాబ్ కోర్టు వాయిదాలకు హాజరు కావడం, లాయర్‌ను ఫీజులు చెల్లించడం ఇబ్బందికరంగా భావిస్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ప్లీడెడ్ గిల్టీ కోసం ప్రయత్నిస్తాడు. అంటే.. ఆయా కేసుల్లో దర్యాప్తు పూర్తయి, చార్జ్‌షీట్లు దాఖలయ్యే వరకు జైల్లోనే ఉంటాడు. ఆపై న్యాయమూర్తి ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించేస్తాడు. దీనినే సాంకేతికంగా ప్లీడెడ్ గిల్టీ అంటారు. దీంతో కోర్టు అతడికి శిక్ష విధించేస్తుంది. అది పూర్తి చేసుకున్న తర్వాతే జైలు నుంచి బయటకు వస్తుంటాడు. ఇది సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే బెయిల్ తీసుకుంటాడని పోలీసులు పేర్కొన్నారు. అనేక కేసుల్లో సాక్షులు, ఫిర్యాదుదారులకు సైతం తన ‘అనారోగ్యం’ చూపించి రా>జీ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఫ్తాబ్ 2007 నుంచి నగరంలో నేరాలు చేస్తున్నప్పటికీ ఒక్క కేసులోనూ ఎన్‌బీడబ్ల్యూ జారీ కాలేదని వివరిస్తున్నారు. ఇతగాడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న నిజామాబాద్ పోలీసుల పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment