
సాక్షి, ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యుదాఘాతానికి నాలుగేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం పాతలింగాల గ్రామపంచాయతీ పరిధి బందాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బందాలకు చెందిన ఆగబోయిన సమ్మయ్య, స్వరూప దంపతులు తమ కుమార్తె అక్షిత(04)ను తీసుకొని తమ పత్తి చేను వద్దకు వెళ్లారు. భార్యాభర్తలు పత్తి ఏరే పనిలో నిమగ్నమవగా.. కూతురు చేనులో అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటోంది. ఈ క్రమంలో పంట భూమి నుంచి ఉన్న విద్యుత్ లైన్ తీగ తెగిపడి ఉంది. అక్షితకు కరెంట్ తీగ తగలగడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కూతురు మృత్యువాత పడడంతో కన్నవారి రోదనలు మిన్నుముట్టాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.