
గుండు చెరువు నుంచి పిల్లల మృతదేహాలను తీసుకొస్తున్న పోలీసులు, స్థానికులు, రోదిస్తున్న తల్లి స్వాతి
ఖిలా వరంగల్: రోజంతా పార్కులో కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపిన ఆ చిన్నారులకు అవే చివరి క్షణాలయ్యాయి. నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లే.. ఆ పిల్లల పాలిట మృత్యువైంది. కుటుంబంలో ఏమైయిందో ఏమో కానీ పార్కులో ఆనందగా గడిపిన మహిళ తన పిల్లలను చెరువులో పడేసి తానూ ఆత్మహత్య చేసుకోబోయింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందగా తల్లి ప్రాణ భయంతో బయటకు వచ్చింది. ఈ ఘటన ఖిలావరంగల్ మధ్యకోటలోని ఏకశిల పార్కులోని గుండు చెరువులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం సమీపంలోని లక్ష్మీపురానికి చెందిన పత్తిపాక పున్నం చందర్,స్వాతి దంపతులకు కుమారుడు రిత్విక్‌సాయి(5) కూతురు తన్మయ్(11 నెలలు) ఉన్నారు. పున్నంచందర్ వరంగల్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. స్వాతి ఇంటి వద్దే ఉంటూ తన ఇద్దరు పిల్లల ఆలనపాలనా చూస్తోంది.
అయితే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు.. స్వాతి మనోవేదనకు గురై తన ఇద్దరు పిల్లలతోపాటు తానూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఇద్దరు పిల్లలను తీసుకుని మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్ పార్కుకు చేరుకుంది. పార్కులో చెట్ల నీడన స్వాతి తన ఇద్దరు పిల్లలతో రాత్రి 8 గంటల వరకు ఆనందగా గడిపింది. పార్కు ఇన్‌చార్జి, సిబ్బంది అందరినీ బయటకు పంపించి గేటుకు తాళం వేశారు. కాగా పార్కులో ఓ మూలన ఉన్న స్వాతి తన ఇద్దరు పిల్లలు తీసుకుని చెరువులోకి వెళ్లింది. తన చేతితోనే ఇద్దరు పిల్లలను నీటి ముంచింది. పిల్లలు మృతి చెందే దాకా ఉండి తానూ ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులోపలికి వెళ్లింది. వెంటనే ప్రాణ భయంతో చెరువులో నుంచి బయటకు వచ్చింది. రోదిస్తూ పార్కు గేటు వద్దకు వెళ్లింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి పిలిచి తన ఇద్దరు పిల్లలు చెరువులో పడి మృతి చెందిన విషయాన్ని చెప్పింది. వెంటనే స్థానికులు, పార్కు నిర్వాహకుడితో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ నందిరాం, ఎస్సైలు రాజన్‌బాబు, డెవిడ్ వెంటనే అక్కడికి చేరుకుని చెరువులో నుంచి పిల్లలను వెలికి తీశారు. చిన్నారుల మృతి విషయం తెలుసుకుని బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని బోరున విలపించారు. ప్రాణభయంతో బయట పడిన స్వాతి గుండెలు బాదుకుంటూ రోదించింది. చిన్నారులు రిత్విక్‌సాయిచ తన్మయ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. తండ్రి పున్నంచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ నందిరాం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment