బాలుడిని విచారిస్తున్న జడ్జి మనోహరరెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : పసి పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న అనాథ బాలల ఆశ్రమాన్ని సీడబ్ల్యూసీ అధికారులు సీజ్ చేశారు. నలుగురు ఆశ్రమ నిర్వాహకులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌లో ఉన్న శ్రీ చౌడేశ్వరి అనాథ ఆశ్రమంలోని పిల్లలు భిక్షాటన చేస్తున్నారని సమాచారం రావడంతో గురువారం సీడబ్ల్యూసీ అధికారులు ఆశ్రమ నిర్వాహకులపై రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో జిల్లా జడ్జీ జి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు శుక్రవారం రెండవ అదనపు జిల్లా జడ్జి జి.మనోహరరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ శివకామిని అమృతానగర్‌లోని ఆశ్రమాన్ని పరిశీలించారు.
పాఠశాలకు పంపించడం లేదు..
పాఠశాలకు వెళ్తున్నారా అని జడ్జి పిల్లలను ప్రశ్నించగా ఇక్కడే చదువుకుంటున్నామని చెప్పారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఇక్కడికే వచ్చి చదువు చెబుతారని పిల్లలు తెలిపారు. వారిలో ఇద్దరు మాత్రం
అనిబిసెంట్ మున్సిపల్
హైస్కూల్‌కు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇక్కడి పిల్లలందరిని ఎయిడెడ్ పాఠశాలకు పంపించాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ తెలిపారు. స్థానికంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులను పిలిపించి అధికారులు మాట్లాడారు. ఈ ఆశ్రమాన్ని సీజ్ చేస్తున్నామని, మరో ఆశ్రమంలో చేర్పించి మీ పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామన్నారు. వారిలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆశ్రమానికి పంపించమని, ఇంటి వద్దనే పెట్టుకొని చదివించుకుంటామని చెప్పగా పిల్లలకు సంబంధించిన ఆధార్‌కార్డు, ఇతర పత్రాలను తీసుకొని కడపకు రావాలని చెప్పారు. నిర్ధారించుకున్న తర్వాత పిల్లలను అప్పగిస్తామని అధికారులు వారితో అన్నారు. పిల్లలకు విద్యను దూరం చేయడంతో పాటు వారి హక్కులను హరించడం నేరమని జడ్జి మనోహరరెడ్డి అన్నారు. భిక్షాటన చేయించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. ఆశ్రమంలోని పిల్లలందరికీ మంచి విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆశ్రమ నిర్వాహకులు అరెస్ట్
ఆశ్రమంలోని 8 మంది పిల్లలను సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో అ«ధికారులు కడపకు తీసుకెళ్లారు. జడ్జి ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్ చేసి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు పాపయ్య, స్వర్ణలత, నాగేశ్వరరెడ్డి, బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రూరల్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
బాలలతో మాట్లాడిన జిల్లా జడ్జి
కడప అర్బన్: ప్రొద్దుటూరులోని చౌడేశ్వరి అనాథ ఆశ్రమంలో ఉంటున్న తొమ్మిది మంది పిల్లలను కడపలోని ప్రభుత్వ బాలుర గృహానికి సీడబ్ల్యూసీ వారు శుక్రవారం తీసుకొచ్చారు. వారిని చౌడేశ్వరీ ఫౌండేషన్ వారు పెట్టిన బాధల గురించి స్వయంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. సదరు చిన్నారులు తమను తల్లిదండ్రుల దగ్గరి నుంచి ఆశ్రయం కల్పిస్తామని తీసుకొచ్చి చందాల పేరుతో భిక్షాటన చేయిస్తున్నారని చెప్పారు. ఈ సంఘటనపై స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పిల్లలకు మొదట భోజన సదుపాయాలు కల్పించాలని చెబుతూనే తన సొంత ఖర్చుతో బిస్కెట్లను తెప్పించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులపై జువైనల్ జస్టిస్ యాక్టు , బెగ్గింగ్ అండ్ మేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదైందని, తద్వారా నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్‌రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ సీఎన్ మూర్తి, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి చక్రపాణి, డీపీఓ యల్లారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ శివకామినితోపాటు ప్రభుత్వ బాలుర గృహం సూపరింటెండెంట్ అన్నాజీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment