పోలీసులకు పట్టుబడ్డ దశ్వంత్
చెన్నై, టీ.నగర్: పోలీసుల నుంచి తప్పించుకుని పరారైన కిరాతకుడు దశ్వంత్ ముంబైలో పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డాడు. చెన్న కుండ్రత్తూరు ప్రాంతానికి చెందిన దశ్వంత్ ఈనెల రెండో తేదీన తన తల్లి సరళ ఖర్చులకు డబ్బులివ్వలేదని ఆమెను హతమార్చి, ఆమె ధరించిన 25 సవర్ల బంగారు నగలను అపహరించి ముంబైకు పరారైన విషయం తెలిసిందే. పోలీసులు దీనిపై విచారణ జరిపి దశ్వంత్‌ను అరెస్టు చేసేందుకు ముంబై వెళ్లి అక్కడ ముంబై పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. తర్వాత అతన్ని జీపులో ఎక్కించుకుని విమానాశ్రయానికి రాగా దశ్వంత్ మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని తెలిపి పరారయ్యాడు. దీంతో పోలీసులు మళ్లీ అతని కోసం గాలింపు జరిపారు. ఇందుకోసం మళ్లీ పదిమందితో కూడిన ప్రత్యేక పోలీసు బృందం ముంబైకు బయలుదేరింది.
చెన్నై పోలీసుల ఫిర్యాదు మేరకు ముంబై విలేపార్లే పోలీసులు కేసు నమోదు చేసి దశ్వంత్ కోసం గాలించారు. దశ్వంత్ ఫొటో ఆధారంగా నగరమంతటా గాలింపులు జరిపారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లలో సైతం అతను తప్పించుకునేందుకు వీలులేకుండా తనిఖీలు జరిపారు. ఇలావుండగా ఇదివరకే దశ్వంత్ దాగివున్న ప్రాంతంలో గాలింపులు జరిపిన సీఐ చార్లెస్ బృందానికి దశ్వంత్ పట్టుబడ్డాడు. తర్వాత అతన్ని ముంబై పోలీసులకు అప్పగించారు. ఇదివరకే పరారైనట్లు కేసు నమోదైన స్థితిలో అతన్ని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌తో విమానంలో చెన్నైకు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం చెన్నైకు తీసుకువస్తున్న అతన్ని సోమవారం జైలులో నిర్బంధించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment