వరంగల్ క్రైం/ఎంజీఎం/మామునూరు: వరంగల్ నగరంలో పట్టపగలే ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తోటి డిగ్రీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. వరంగల్‌లో ఆ యువతికి అత్యవసర చికిత్సనందించినా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 70% గాయాల కారణంగా రవళి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడికి పాల్పడిన యువకుడు సాయి అన్వేష్ ఘటన తర్వాత పారిపోగా.. కేయూ రోడ్డులోని గొల్లపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆయన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావు దంపతుల కూతురు రవళి (22) హన్మకొండ రాంనగర్ ప్రాంతంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంఈసీఎస్) ఫైనలియర్ చదువుతోంది.
కాలేజీకి 300 మీటర్ల దూరంలోని హాస్టల్‌లో ఉంటోంది. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో రవళి హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి కళాశాలకు వెళ్తుండగా.. అదే కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్న పెండ్యాల సాయి అన్వేష్ (24) ఆమెను అడ్డుకున్నాడు. ‘నన్ను ప్రేమించాలి’ అంటూ కొంతదూరం వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో పిడిగుద్దులు గుద్దాడు. కిందపడిపోయిన రవళిపై వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి అందరూ చూస్తుండగానే నిప్పంటించాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తూనే.. మంటల్లో కాలుతూ కేకలు పెడుతూ కుప్పకూలిపోయింది. పెట్రోలు పోస్తూ నిప్పంటించే సమయంలో రవళి స్నేహితులు అన్వేష్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని చంపుతానంటూ బెదిరించడంతో అందరూ భయపడిపోయారు. వాగ్దేవి హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్లే దారిలో లలితారెడ్డి గర్ల్స్ హాస్టల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాణాపాయస్థితిలో రవళి
రవళి కాలిన గాయాలతో కొట్టుకుంటుండగా తోటి విద్యార్థి«నులు ఫోన్ చేయడంతో 108 వచ్చింది. బాధితురాలిని 9.30 గంటలకు ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. ఎంజీఎం పరిపాలనాధికారులు, అత్యవసర విభాగం వైద్యులు, ప్లాస్టిక్ సర్జన్ నిపుణులు హుటాహుటిన రవళికి వైద్యచికిత్సలు అందించారు. విద్యార్థిని 70–80% కాలిన గాయాలతో ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యచికిత్సలు అవసరమని భావించి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రవళికి యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రత్యేక వైద్య బృందం చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రవళి ముఖం, ఛాతి, కడుపు, చేతులు, వీపు, తొడల ప్రాంతంలో తీవ్రంగా కాలిపోగా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన పొగ వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రవళికి ఫిజిషియన్, పల్మనాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్‌లతో కూడిన వైద్యబృందం చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
శోకసంద్రంగా ఎంజీఎం ఆసుపత్రి
రవళిపై పెట్రోల్ దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులో, తోటి విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఎంజీఎం ఆసుపత్రి అత్యసర విభాగానికి చేరుకున్నారు. రవళిని పరిస్థితిని చూసినవారు దుఃఖాన్ని దిగమింగలేక బోరున విలపించారు. అప్పటివరకు తోటి స్నేహితులతో సంతోషంగా గడిపిన రవళి ప్రాణాపాయస్థితిలో ఎంజీఎం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు
‘నేను పొద్దున్నే బాయి కాడికి పోయిన. నా బిడ్డకు జ్వరం వచ్చిందని చెప్పిండ్రు. వెంటనే మా ఊరి నుంచి వరంగల్‌కు వచ్చిన. ఇక్కడికి వచ్చనాంక నా బిడ్డమీద పెట్రోలు పోసి నిప్పంటించినట్టు చెప్పిండ్రు. ఒక్కగానొక్క బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడు’అని రవళి తండ్రి సుధాకర్ రోదించాడు.
సజీవదహనం చేయాలి
‘మా బిడ్డ ఎవరి జోలికీ పోదు. అన్యాయంగా ఇంత దారుణం చేసిండు. ఇసోంటోళ్లకు కోర్టులు, జైలుశిక్షలు సరిపోవు. మా బిడ్డపై దాడి చేసినవాడిని సజీవదహనం చేయాలి. ప్రాణానికి ప్రాణమే సమాధానం కావాలి’అని రవళి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డుకునే లోపే నిప్పంటించాడు
వాగ్దేవి కాలేజీ దగ్గర పని ఉంటే ఫ్రెండ్స్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఓ యువతిపై నిందితుడు పెట్రోలు పోస్తున్న విషయాన్ని గమనించాను. ముందుగా నీళ్లు కావచ్చనుకున్నా.. కానీ పెట్రోల్ వాసన రావడంతో ఏం చేస్తున్నవురా.. అనే లోపే అగిపుల్ల గీసి అమ్మాయిపై విసిరేసిండు. నేను ఒక్కసారిగా బండిని తన్నాను. వాడు కిందిపడిపోయాడు. ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాడు పారిపోయాడు. – అన్వేష్, ప్రత్యక్ష సాక్షి
ప్రేమ పేరుతో వేధింపులు
సాయి అన్వేష్ స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట మండలం చెన్నారం గ్రామం. తల్లిదండ్రులు పెండ్యాల సుజాత, దేవేందర్. సాయి అన్వేష్, రవళి సంగెం మండలం లోహితలోని కాకతీయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంటర్ చదువుతున్న సమయంలో వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలిసింది. రవళి హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీలో చేరితే అదే కళాశాలలో బీకాంలో సాయి అన్వేష్ చేరాడు. వీరిమధ్య కొనసాగిన ప్రేమ డిగ్రీలోకి వచ్చిన తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో రవళిపై అన్వేష్ కోపం పెంచుకున్నాడు. ప్రేమను కొనసాగించాల్సిందేనంటూ రవళిపై ఒత్తిడి తెచ్చాడు. చాలా సార్లు బెదిరించాడు కూడా. అన్వేష్ వేధింపులు ఎక్కువవడంతో.. రెండు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది.
దీంతో రవళి తల్లిదండ్రులు సాయి అన్వేష్ తల్లిదండ్రులకు చెప్పి.. వారి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అన్వేష్‌ను హెచ్చరించారు. దీంతో తాను ఇకపై రవళి జోలికి వెళ్లనంటూ అన్వేష్ లిఖితపూర్వకంగా మాటిచ్చాడు. అయితే తన ఊర్లో పరువు తీసిందనే కారణంతో.. కక్ష పెంచుకున్న అన్వేష్.. గతంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు చూపెట్టి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో డిగ్రీ పూర్తవుతుంది, రవళి దూరమవుతుంది, తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కొద్దనే రవళిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా చెన్నారం వదిలి.. గీసుగొండ మండలం ధర్మారం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. బుధవారం ఉదయం హన్మకొండ రాంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల సమీపంలో పెట్రోల్‌తో మాటువేసి దారుణానికి పాల్పడ్డాడు.
పోలీసుల అదుపులో నిందితుడు
రవళిపై పెట్రోల్ దాడి చేసిన తర్వాత సాయి అన్వేష్ బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. కాసేపటి తర్వాత ములుగు రోడ్డు (కేయూ రోడ్డు)లోని గొల్లపల్లి పెట్రోల్ బంక్ వద్ద సాయి అన్వేష్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అన్వేష్‌ను హన్మకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో చెన్నారంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఘటన విషయం తెలియగానే.. సాయి అన్వేష్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం.
విద్యార్థుల ధర్నా
రవళిపై జరిగిన పెట్రోలు దాడి గురించి తెలుసుకున్న వాగ్దేవి కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను శాంతింపచేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఉన్మాదికి శిక్ష పడేవరకు కదిలబోమంటూ విద్యార్థులు పట్టుబట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. నిందితుడికి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఎక్కడైనా అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే.. వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
కఠినంగా శిక్షిస్తాం: ఎర్రబెల్లి
రవళిపై హత్యాయత్నం చేసిన అన్వేష్‌కు కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళిని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్వేష్‌ను గతంలోనే పోలీసులు హెచ్చరించి వదలివేశారని, గ్రామస్తులు కూడా బెదిరించినా పద్దతి మార్చుకోలేదన్నారు. ఆ యువతికి అయ్యే వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆ కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందించేందకు సీఎం హామీ ఇచ్చారన్నారు. డాక్టర్లు కూడా ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రవళి తల్లి పద్మ మాట్లాడుతూ గతంలో పెద్దల సమక్షంలో నిందితున్ని కఠినంగా హెచ్చరించామని అయినా ప్రేమ పేరుతో వేధించాడని వాపోయారు. తనకు ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనం చేసిన నిందితున్ని ఇక్కడే ఉరితీయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment