
శంషాబాద్ హత్యాచార ఘటనపై మీడియాకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు.
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ హత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను ప్రచురించరాదని మీడియా సంస్థలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఇలాంటి అత్యంత హేయమైన సంఘటన వివరాలను పదేపదే ప్రసారం చేయడంతో ప్రజలు ప్రత్యేకించి మహిళలు వారి తల్లితండ్రుల్లో భయం నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సంయమనం పాటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో తమతో కలిసి రావాలని, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వడంలో సహకరించాలని కోరారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇలాంటి ఘటనల్లో బాధితురాలి పేరు ఇతర వ్యక్తిగత వివరాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి దూరంగా ఉండాలని మీడియా సంస్ధలను కోరుతున్నామని చెప్పారు. బాధితురాలి వివరాలు వెల్లడికావడంతో బాధిత కుటుంబానికి వివిధ రూపాల్లో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలనే విషయంలో వారిలో అవగాహన పెంచే అంశాలను ప్రసారం చేయాలని కోరారు.