
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిట్రా వెంకట సాంబశివరావు
నవులూరు(దుగ్గిరాల): మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కత్తితో పొడిచి గాయపరచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళగిరి మండల పరిధిలోని నవులూరుకు చెందిన బిట్రా వెంకట సాంబశివరావు అదే గ్రామానికి చెందిన దానబోయిన బాలాజీ మంగళగిరి పట్టణంలో మద్యం తాగారు. ఆటోలో నవులూరు వచ్చారు. ఈ సమయంలో మాటా మాటా పెరిగి వివాదానికి దారి తీసింది. కోపోద్రేకానికి గురైన బాలాజీ సాంబశివరావుపై కత్తితో పొడిచి దాడి చేశాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ వినోద్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడ్ని హుటాహుటిన చినకాకానిలోని ఎన్నారై వైద్యశాలకు తరలించారు.
అయితే, వైద్యం చేసేందుకు సిబ్బంది నిరాకరించారు. నగదు చెల్లిస్తేనే చేస్తామని వాదనకు దిగారు.పైగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. బాధితుని పరిస్థితి విషమంగా మారడంతో ఎస్‌ఐ వినోద్‌కుమార్ సొంత నగదును చెల్లించి చికిత్స ప్రారంభించాలని సూచించారు. సాంబశివరావుకు సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చికిత్సకు నగదును చెల్లించి ఔదర్యాన్ని చాటుకున్న ఎస్‌ఐకు బాధితుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై రూరల్ ఎస్‌ఐ వినోద్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రి తీరుపై సర్వత్రా విమర్శ
ఆస్పత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణం కంటే ధనమే ముఖ్యమనే ధోరణిలో ఆస్పత్రి యాజమాన్యాలు వ్యహరించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. వైద్యశాఖ దృష్టి సారించి ప్రమాదంలో ఉన్న క్షతగాత్రులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment