ప్యార్‌సింగ్ నేగీ, రేఖాదేవి (ఫైల్)
కుటుంబ కలహాల కారణంగాక్షణికావేశంతో వేర్వేరు ప్రాంతాల్లో రెండు జంటలు ఒకే రోజు అఘాయిత్యానికి ఒడిగట్టాయి. నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్ ప్రాంతంలో అదే తరహాలో మరో జంట బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటనలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, స్థానికుల సమాచారంతో తక్షణమే స్పందించిన రాచకొండ పోలీసులు భార్యను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటనలు సోమవారం చోటు చేసుకున్నాయి.వివరాల్లోకి వెళితే..
జవహర్‌నగర్, హిమాయత్ నగర్:పెళ్లయిన రెండేళ్లకే కుటుంబ కలహాల కారణంగా ఓ జంట ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడి భార్యను పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, కే సముద్రం ప్రాంతానికి చెందిన బండి మురళి(30) వరంగల్ జిల్లా సంగెం ప్రాంతానికి చెందిన ప్రియాంక (25)లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. మురళి నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మురళీ హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రియాంక గృహిణి. వీరు ఎల్లారెడ్డిగూడ, పద్మారావునగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా భార్య, భర్తల గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికిలోనైన మురళి కోపంగా గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియాంక సైతం మరోగదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో సమాచారం అందుకున్న జవహర్‌నగర్ హెడ్‌కానిస్టేబుల్ మైపాల్, పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ హోంగార్డు నవీన్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే మురళి మృతిచెందగా కొన ఊపిరితో ఉన్న ప్రియాంకను చేతులపై తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆమె ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. మురళి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్యార్‌సింగ్ నేగీ, రేఖాదేవి మృతదేహాలు
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
హిమాయత్‌నగర్: కుటుంబకలహాలతో భార్యభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్.ఐ.కర్ణాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్యార్‌సింగ్‌నేగీ(42), రేఖాదేవి(38) దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చారు. వీరికి ఒక కుమారుడు సచిన్, కుమార్తె అంజలి ఉన్నారు. ప్యార్‌సింగ్‌నేగీ అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు వారి కుమారుడు సచిన్ పోలీసులకు తెలిపాడు. తెల్లవారుజామున ప్యార్‌సింగ్ నిద్రలేచి చూసేసరికి మరో గదిలో రేఖాదేవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించడంతో మనస్తాపానికిలోనైన అతను భార్య చున్నీతో కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్రలేచిన పిల్లలు తండ్రిని చూసి షాక్‌కు గురైయ్యారు. సచిన్ కత్తితో చున్నీని కోయడంతో అతను పక్కనే ఉన్న బెడ్‌పై పడిపోయాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న తల్లిని గుర్తించిన చిన్నారులు స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుల కుమారుడు సచిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment