
బంజారాహిల్స్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ మస్కా కొట్టి పరారైన కారు డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలు.. శనివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు సిబ్బందితో కలిసి జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో టీఎస్ 34 బి టీఆర్ 0277 డిజైర్ కారు నడుపుతున్న వ్యక్తికి పోలీసులు శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తాను కారును పక్కన ఆపుతానంటూ వారితో మాట్లాడుతూనే అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినందుకు పరారీలో ఉన్న కారు డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment