సాక్షి, సిటీబ్యూరో: ఓ పక్క మద్యం తాగి వాహనాలు నడపటం... మరోపక్క లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం... ఇలాంటి తీవ్రమైన ఉల్లంఘనులపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీరికి జరినామాలతో సరిపెట్టకుండా నిందితులుగా పేర్కొంటూ కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. వీటిని న్యాయస్థానం సైతం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఉల్లంఘనలకు సంబంధించిన గత నెలలో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్స్‌లో మొత్తం 2254 మంది పట్టుబడ్డారు. వీరిలో మందుబాబులు కోర్టుకు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.2,25,81,400. దీనికితోడు వీరిలో 162 మంది జైలుకు వెళ్లగా... ఇద్దరి మంది డ్రైవింగ్ లైసెన్సుల్ని (డీఎల్స్) శాశ్వతంగా, మరొకరిది నిర్ణీత కాలానికి రద్దు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినట్లు అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ సోమవారం వెల్లడించారు.
డ్రంక్ డ్రైవింగ్ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు ఇద్దరి డ్రైవింగ్ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా... మరొకరిది ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఇద్దరికి 11 రోజులు, ముగ్గురికి పది రోజులు, ఒకరికి తొమ్మిది రోజులు, మరొకరికి ఎనిమిది రోజులు, 36 మందికి వారం, 106 మందికి ఐదు రోజులు, ఎనిమిది మందికి మూడు రోజులు, ఐదుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించినట్లు ఆయన వివరించారు. డ్రంక్ డ్రైవింగ్‌తో పాటు మరో ఉల్లంఘననీ తీవ్రంగా పరిగణిస్తూ చార్జ్‌షీట్లు వేస్తున్నామన్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకుగాను ముగ్గురికి రెండు రోజులు, మరొకరికి ఒక రోజు జైలు శిక్షలు విధించినట్లు తెలిపారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్‌లో పాస్‌పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని అనిల్‌కుమార్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment