బాలికలను వేధింపులను ఆపాలంటూ ర్యాలీలో పాల్గొన్న యువతులు
ఏలూరు(సెంట్రల్) : ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను అతి దారుణంగా హత్యాచారం చేసిన సంఘటనలో దోషులకు మరణ శిక్ష విధించాలని నగర పాలకసంస్థ కో ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాలికలపై లైంగిక వేధింపులను నిరసిస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో పాల్గొన్న పెదబాబు మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌లోని కదువా ప్రాంతంలో చిన్నారిపై మతోన్మాదులు అత్యాచారం చేసి దారుణంగా చంపడాన్ని సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని, బాలికలపై గాని మహిళలపై గాని అత్యాచారాలు చేస్తే జీవితాంతం జైలు గోడలే దిక్కుగా ఉండాలని అటువంటి కఠిన చట్టాలు అమలు చేసినప్పుడే సమాజంలో బాలికలు, మహిళలు స్వేచ్ఛగా తిరగగలుగుతారన్నారు.
ముక్కు పచ్చలు అరని చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగట్టే వారు ఎవరైనా కఠినంగా శిక్షకు గురైనప్పుడే సమాజం హర్షిస్తుందని భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించగలుగుతామని ఆయన చెప్పారు.
ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ చట్టం నుండి తప్పించుకోవచ్చుననే ఆలోచన పెరగడం వలన దేశంలో నిత్యం బాలికలపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే దోషులకు శిక్షపడే విధంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి శిక్షించాలన్నారు.
ర్యాలీలో డెప్యూటీ మేయరు నాయుడు పోతురాజు, కార్పొరేటర్లు మారం అను, పునుకొల్లు పార్థసారధి, గుడివాడ రామచంద్రకిషోర్, జిజ్జువరపు రమేష్, పోలిమేర దాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment