సాక్షి, సిటీబ్యూరో: ఖరీదైన వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ అందినకాడికి దండుకునే నేరగాళ్లు యాడ్స్ యాప్ ఓఎల్‌ఎక్స్ మాత్రమే కాదు.. సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌నూ వాడుతున్నారు. ఇందులోనూ ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించి అందినకాడికి గుంజేస్తున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం తొలికేసు నమోదైంది. రక్షాపురం ప్రాంతానికి చెందిన బీకామ్ విద్యార్థి ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో వ్యక్తి పోస్ట్ చేసిన యాడ్ చూశాడు. ఆధునిక ఐ ఫోన్‌ను కేవలం రూ.33 వేలకు విక్రయిస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై ఆసక్తి చూపిన సదరు విద్యార్థి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా అవతలి వ్యక్తితో చాట్ చేశాడు. తాను ఫోన్ కొంటానని చెప్పిన అతను ఫోన్ నెంబర్ తీసుకున్నారు. వాట్సాప్ కాల్‌లో మాట్లాడిన నిందితుడు తమకు ఈ ఫోన్లు హోల్‌సేల్‌గా, నేరుగా కంపెనీ నుంచి వస్తాయని అందుకే తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నమ్మబలికాడు. అడ్వాన్స్‌గా రూ.22 వేలు చెల్లించాలని షరతు పెట్టాడు.
మిగిలిన మొత్తం ఫోన్ అందుకున్న తర్వాత చెల్లించే అవకాశం ఇచ్చాడు. విద్యార్థికి పూర్తి నమ్మకం కలగడానికి అతడి నుంచి చిరునామా సైతం తీసుకున్న నేరగాడు దానిని ఓ కాగితంపై టైప్ చేశాడు. ఓ ఐఫోన్ బాక్సును పార్శిల్ చేస్తున్నట్లు, దానిపై విద్యార్థి చిరునామాతో కూడిన కాగితాన్ని అతికించినట్లు వీడియో తీశాడు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా విద్యార్థికి షేర్ చేశాడు. ఇది చూసిన బాధితుడు పూర్తిగా నేరగాడి వల్లో పడిపోయాడు. అతడు కోరినట్లే రూ.22 వేలు సూచించిన విధంగా బదిలీ చేశాడు. ఆపై నిందితుడి నుంచి స్పందన లేకపోవడం, ఫోన్ సైతం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment