లాక్‌డౌన్ ప్రభావం మందుబాబులపై భారీగానే ఉంది. గడిచిన 22 రోజులుగా మద్యం దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్న, ఆ యత్నాలు చేస్తున్న, మతిభ్రమిస్తున్న కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో మద్యం కోసం మందుబాబులు చేయని ప్రయత్నం లేదు. నగరంలో మద్యం దొరుకుతుందని భావిస్తూ అనేక ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. పనిలో పనిగా ఆన్‌లైన్‌లోనూ సెర్చ్ చేసేస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు.
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ వైన్ షాప్ బగ్గా వైన్ షాప్ పేరుతో పాటు మరికొన్ని మద్యం దుకాణాల పేర్లతో ఫేస్‌బుక్‌లో పేజ్ లు ఓపెన్ చేశారు. వీటి ద్వారా ఆర్డర్ ఇస్తే కావాల్సిన బాటిల్స్‌ను డోర్ డెలివరీ చేస్తామంటూ నమ్మించి భారీగా దండుకుంటున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వల్లో పడి గత వారం ఓ బాధితుడు రూ. 50 వేలు కోల్పోగా... తాజాగా మంగళవారం మరో బాధితుడు రూ. 93,600 పోగొట్టుకున్నారు. ఇతడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మద్యం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బగ్గా వైన్స్ పేరుతో ఏర్పాటైన ఫేస్‌బుక్ పేజ్ కనిపించింది. అందులో 24 గంటలూ డోర్ డెలివరీ అంటూ కొన్ని ఫోన్ నంబర్లు పొందుపరిచి ఉన్నాయి. బాధితుడు వాటిని సంప్రదించడంతో బగ్గా వైన్స్ యాజమాన్యం మాదిరిగానే మాట్లాడారు.
తమకు మద్యం కావాలంటూ బాధితుడు చెప్పడంతో ఏఏ బ్రాండ్లు కావాలో ఎంచుకోవాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. దీంతో బాధితుడు ఓ బ్రాండ్‌ను ఎంచుకోగా దానికి సంబంధించి మొత్తం రూ.1600 అవుతుందని, ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. గూగుల్ పే ఖాతా నుంచి బాధితుడు చెల్లించాడు. ఆపై అతడిని సంప్రదించిన సైబర్ నేరగాళ్లు ఆ బ్రాండ్ స్టాక్ లేదని, కేవలం ఖరీదైనవి మాత్రమే ఉన్నాయంటూ చెప్పారు. అందుకు సంబంధించిన మిగిలిన మొత్తం చెల్లింపు కోసం తాము పంపే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని కోరారు. బాధితుడు అలానే చేసి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఎంచుకోగా... ఇతడి ఖాతా నుంచి మూడు దఫాల్లో రూ. 92 వేలు సైబర్ నేరగాళ్ల గూగుల్ పే ఖాతాకు వెళ్లిపోయాయి.
దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది రాజస్థాన్ గ్యాంగ్స్ పనిగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో తమ సంస్థ పేరుతో ఏర్పాటైన నకిలీ పేజీలపై బగ్గా వైన్స్ సంస్థ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా స్పందించిన అధికారులు వాటిని తొలగించాలని కోరుతూ ఫేస్‌బుక్ సంస్థకు నోటీసు జారీ చేశారు. ఈ లోపే దీని పేరుతో మరిన్ని, ఇతర వైన్స్ పేర్లతో కొన్ని పేజీలు ఏర్పడ్డాయి. ఈ తరహా ఫేస్ బుక్ పేజీలు, బోగస్ ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో మరికొన్ని ఉండి ఉండవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వాటిని నమ్మి మోసపోవద్దని అప్రమత్తం చేస్తున్నారు. మద్యం మాత్రమే కాదని ఫుడ్ డెలివరీ, వివిధ ఆర్డర్ల క్యాన్సిల్ కోసం అనేక మంది ఆన్‌లైన్‌లో ఉన్న నంబర్లు నమ్మి వాటికి కాల్ చేస్తున్నారని, వీటిలో కొన్ని నకిలీవీ ఉండే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment