శ్రీకృష్ణానగర్‌లో మద్యం తాగి హల్‌చల్ చేస్తున్న వ్యక్తిని అదుపు చేస్తున్న పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో 43 రోజుల విరామం అనంతరం తెరుచుకున్న మద్యం దుకాణాల వద్ద రద్దీ ఏ స్థాయిలో ఉందో.. వీటి ఫలితంగా పోలీసులకు వస్తున్న తలనొప్పులు అదే స్థాయిలో ఉన్నాయి. బుధ, గురువారాల్లో మద్యంతో ముడిపడి ఉన్న రెండు ప్రమాదాలు, ఓ హత్యాయత్నం జరగ్గా.. మందుబాబులు చేసే న్యూసెన్స్‌కు సంబంధించి పదుల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. కేసులు లేకుండా ఈ ‘నిషా’చరుల్ని కస్టడీలో ఉంచుకోవడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు ఓ ఇంటి గోడను ఢీకొట్టడంతో పెద్ద ‘విధ్వంసమే’ చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలోఓ వ్యక్తి మద్యం మత్తులో మరో వ్యక్తి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. డబీర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిచిన్నారిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాధిత బాలుడికి గాయాలయ్యాయి. ఇవన్నీ రికార్డులకు ఎక్కినవి కాగా... మద్యం కోసం రాంగ్‌రూట్‌లో వస్తూ, రోడ్డుకు అవతల వైపు ఉన్న షాపులో మద్యం ఖరీదు చేసి కంగారుగా తిరిగి వస్తూ ప్రమాదాలకు కారణమైన, యాక్సిడెంట్స్‌కు గురైన కేసులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ అక్కడిక్కడే సద్దుమణిగిపోతుండటంతో పోలీసులవరకు రావట్లేదు. వీటన్నింటికీ మించి కేసులుగా రిజిస్టర్ చేయలేని, అరెస్టులు ఆస్కారం లేని, వదిలే అవకాశం లేని కేసులతోనే పోలీసులకు తలనొప్పులు వస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఈ తరహాకు చెందిన ఫోన్‌కాల్స్, వాగ్వాదాలు, కలాపాల సంఖ్య పెరిగిపోయాయి.
మందుబాబు హల్‌చల్
జూబ్లీహిల్స్: ఎవరినైనా అదుపు చేయడం సాధ్యమేమో కానీ ఈ తాగుబోతులను అదుపు చేయాలంటే తలప్రాణం తోకలోకి వస్తుందంటూ విధుల్లో ఉంటున్న పోలీసులు వాపోతున్నారు. వైన్‌షాపుల వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు మందేసి వస్తున్న వారిని అదుపు చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. గురువారం ఓ వ్యక్తి ఫుల్లుగా మందేసి శ్రీకృష్ణానగర్‌లోని తన తల్లిదండ్రులపై దాడి చేసేందుకు రాగా చుట్టుపక్కల వారు గమనించి అక్కడే విధుల్లో ఉన్న బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అక్కడే రెండు గంటల పాటు కూర్చుండబెట్టి పంపించాల్సి వచ్చింది.
కుటుంబీకులకు ప్రత్యక్ష నరకం..
దొరక్క దొరక్క మద్యం దొరకడంతో ఎవరికి వారు పరిమితికి మించి, పూటుగా తాగేస్తున్నారు. బార్లు తెరుచుకోకపోవడం, మద్యం దుకాణాల వద్ద తాగే ఆస్కారం లేకపోవడంతో ఎవరిక వారు ఇంటికే వెళ్లి బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు. ఆ తర్వాత కుటుంబికులు, భార్యలకు నరకం చూపిస్తున్నారు. వీరి బాధ భరించలేని సంబంధీకులు ‘డయల్–100’కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో స్పందించి ఆయా ప్రాంతాలకు వెళ్తున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న వారికి తీసుకుని పోలీసుస్టేషన్లకు చేరుకుంటున్నారు. తమ వారిపై కేసులు, అరెస్టులు వద్దని కేవలం మందలించండి అని మందుబాబుల కుటుంబికులే పోలీసుల్ని వేడుకుంటున్నారు. నిషా తగ్గిన తర్వాత తిరిగి పంపించేయాలని కోరుతున్నారు. దీంతో అనధికారికంగా ఠాణాలో ఉంచుకున్న ఈ మందుబాబులకు కాపలా కాయలేక, వారి మాటలు, పాటలు, వేషాలు తట్టుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి పోలీసుస్టేషన్‌లో ఉండే సెల్‌లోనూ (జైలు) వేసే ఆస్కారం లేదని చెబుతున్నారు. అలా వేస్తే మద్యం మత్తులో వీరేదైనా అఘాయిత్యం చేసుకోవడమో, ఎండ, వేడి కారణంగా ఏదైనా జరగడమో చోటు చేసుకుంటే తమకు లేనిపోని సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. దీంతో ‘నిషా’చరులు మామూలు స్థితికి వచ్చేవరకు స్టేషన్‌లోనే ఉంచి, వారిపై డేగకంటి నిఘా ఉంచుతున్నారు. వీరిలో ఎవరి ఆరోగ్య పరిస్థితి ఏమిటో తెలియకపోవడంతో దూరంగానే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు.
పోలీసులకు ఇబ్బందులు..
మరోవైపు మద్యం షాపుల వద్దకు తాగిన మత్తులో వచ్చే వారితో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ స్థితిలోని వారు క్యూలో నిల్చోవడానికి ఇబ్బంది పెట్టకున్నా.. మత్తులో వస్తున్న వారు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. బుధవారం కొనుగోలు చేసుకుని వెళ్లిన వారు ఆ మద్యం తాగి మత్తులోనే మళ్లీ ఖరీదు చేసుకోవడానికి వస్తున్నారని, వీళ్లు క్యూ, భౌతికదూరం విషయంలో వాగ్వాదాలకు దిగుతున్నారని పోలీసులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల్ని ఏర్పాటు చేసుకునేలా వైన్ షాపుల వారికి క్షేత్రస్థాయి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ‘లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలో నేరాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభం కావడంతో ఇక ఈ రెండూ కొద్దిగా పెరిగే ఆస్కారం ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుందో వేచిచూడాలి’ అని నగర పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment